పుట:Dhanurvidyaa vilaasamu (1950).pdf/57

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వీరభద్రగజపతిని జయించి అతనికి అభయమిచ్చెను. . . సింహాచలమువరకు సాధించెను, కటకం పర్యంతం జయించి గజపతివారి కుమార్తెను బలాత్కారముగా వివాహము చేసుకొనెను. సింహాచలం అవతలి దేశములు గజపతి వారికి వదలి కొండవీటికి సాళ్వతిమ్మరుసు మేనల్లుడు నాదెళ్ల గోపమంత్రికి పట్టం గట్టెను. నాదెళ్ల గోపమంత్రిగారు దేవాలయము కట్టించి పరిపాలించుచుండెను. రాయల భార్య కంభంలో ఉండిపోయి తన స్వంతద్రవ్యముతో కంభం చెరువు త్రవ్వించెను. దేవాలయము కట్టించినది, 1455 వరకు కృష్ణరాయలు రాజ్యం చేసెను. తరువాత అచ్యుతరాయలు 1456 నుంచి 1467 వరకు 8 సంవత్సరములు పరిపాలించెను. ఇతనికి ప్రధానియైన రామయభాస్కరునికి అధికార మిచ్చి కొండవీటికి పంపగా పూర్వము రెడ్డిరాజులు కట్టించిన సౌధములు గుళ్లు పడిపోవుటవల్ల ఆ రాళ్లు తెప్పించి యీ దుర్గానికి పశ్చిమభాగమందు మావులకోట గట్టించి పట్నం నిర్మించి గోపీనాథస్వామివారిని ప్రతిష్టించెను. ఇక్కడ ఒక బావి త్రవ్వించి తిరుగుబాటు చేసిన పాలెగాండ్లను నమ్మకముమీద పిలిపించి స్వామివారికి ప్రదక్షిణం చేయవలసినదని చెప్పి అదివరకు పూర్వమే తగిన ఏర్పాటు చేయబడిన ఆబావిలో వారిని కూలద్రోసి చంపెనని ప్రతీతి. ఈ పట్టణమునకు కొండవీటి గోపీనాథపురమని నామాంకితము చేసిరి. ఈ పురం దగ్గరగా వెన్నముద్ద కృష్ణుడు మూలస్థానేశ్వరుడు. అంగడివీరభద్రుడు మొదలయిన దేవస్థానములు నిర్మించెను. ఈయన సహోదరి చిన్నమాంబ ఈ పట్టణానికి మూడుఘడియల దూరాన రామచంద్రపురమనే అగ్రహారము కట్టించి పర్వతేశ్వరుడను ప్రతిష్టించి, గోపీనాథ అనే చెరువు త్రవ్వించి సాంతలూరు అనే అగ్రహారమును ధారాగ్రహితము చేసేను. ఇతను మొగలాయి పౌజును జయించి రాజ్యము నిర్వక్రముగా పరిపాలించెను. విజయనగరమందు సదాశివదేవమహారాయలు పరిపాలనము చేయుచుండి అత్రేయగోత్రులైన విఠలయ్య దేవమహారాజు గారిని ఈ దేశానికి పట్టం కట్టిరి. ఇతను కొండసింగయ్య అను దేవాలయమును ఈ దేవాలయమునకు ఉత్తరాన కొండపల్లి చెరువు పడమర వకతోట నిర్మించెను. ఇతను