పుట:Dhanurvidyaa vilaasamu (1950).pdf/45

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శాలకుఁ జేర్చినాను. తద్గ్రంథకర్త ఉరుటూరి వెంకటకృష్ణకవి తన గ్రంథమునే తద్ధనుర్విద్యావిలాసరచనాప్రేరకుఁ డగు కృష్ణానేని తిరుపతి మాణిక్యారాయప్రభుని ప్రేరణముననే రచించినట్టు వ్రాసినాడు అదికూడ (ఈవని) కోదండరామస్వామికే యర్పితమై యున్నది. కృతిప్రేరకుఁడగు ఆతిరుపతిరాయనిగూర్చి ధనుర్విద్యావిలాసములో నున్న పద్యములే ఆకాశరావణసంహారమున నున్నవి. ఆకాశరావణసంహారమున గొన్ని తాటియాకు లేయానుపూర్వి లేక దొరకినవిగాన దానిని గూర్చి యింతకంటె హెచ్చువిషయములు గుర్తింపఁగా లేదు. అతని గద్య మిట్టిది. “ఇది శ్రీవిమలచిత్తమునిచరణసేవాధురీణ, రాఘవపాండవీయాది బహుప్రబంధనిబంధనప్రవీణ ఆపస్తంభసూత్రహరితసగోత్ర వురుటూరి........౦కశ్లేషకవితాపితామహోంక సంస్కృతాంధ్రభాషాచతుర్విధవివిధకవితానిలయ వెంగన మంత్రి తనయవినయవిశంకట వెంకటకృష్ణకవి ప్రణీతం బైన యాకాశరావణసంహారంబునందు తృతీయాశ్వాసము.”

కృతిప్రేరకులు – వెలమవారు

'వెలమ' యని నేటివ్యవహార మైనను వెలుమ 'వెల్మ' పదములే ప్రాచీనన్యవహారరూఢములు, రెడ్డి, కమ్మ, వెలుమ, బలిజ జాతులవారు బహుప్రాచీనకాలమున నుండియు నంధ్రదేశమున మహాప్రాభవము ననుభవించినవారు. ఇప్పుడు ప్రసక్తులగు వెలుమవారిలో పద్మనాయకులనువారుఁ (వారికే పద్మవెలుమ లని వ్యవహారము) చాల సుందరాకారులు, రాచఠీవిగలవారు, ఏల్బడులు నెఱపుచు, వీరాధివీరు లయి చాల విఖ్యాతిగన్నవారు. వారియాచారవ్యవహారములు రాచవారితీరు లవి. కాకతీయుల నాఁట నుండి నేఁటిదాఁక నవిచ్ఛిన్నమయిన రాజ్యవైభవము ననుభవించుచు వర్థిల్లినవారు. వెలుమవారిలో రావువంశ్యులగు వెలుగోటి ప్రభువులు. ‘వెలుమ’ పదము 'వర్మ' పదవికృతి కావచ్చును. 'వర్మ' పదము వరుమ, వలుమ వెలుమ పదములుగాఁ గ్రమపరిణామము చెందియుండవచ్చును. 'నందాంతం క్షత్రియకులమ్' అన్న ప్రవాదముచొప్పున నెన్నఁడో క్షత్రియులు పలువురు చతుర్థ