పుట:Dhanurvidyaa vilaasamu (1950).pdf/130

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

66

శరనిర్మాణము


భాతి నమరుచుండు నూతనాభ్యాసికి
విశిఖనిచయ మేయు వేళలందు.

42


చ.

పదపడి హంసరొమ్మువలె భాసిలుచుండెడు నంగుళీత్రమున్
ముదమున లక్ష్యవేది శరముల్ నినుపం జను ధన్వికిన్ దగున్
గుదురయి నిమ్మబద్దవలె గుండ్రనగాఁ దగు నంగుళీత్రముం
పొదువగు దూరపాతిశరపుంజసమాకలనానుకూలమై.

43


ఉ.

ఏనుఁగు నెక్కి సాహిణము నెక్కి రథోత్తమ మెక్కి పోరులం
దైనను వేఁటలాడు నెడ నైనను బర్వులువాఱుచున్ యదృ
చ్ఛానిరతిన్ ధనుర్ధరుఁడు చర్మవినిర్మిత మంగుళీత్రముం
బూని శరంబు లేయ నగు బొట్టనవేలు చలింపకుండుటన్.

44


శా.

క్షోణి న్మద్గువిషాణఖండమున సర్గోధాంగచర్మంబునన్
మాణిక్యంబున రూప్యకాంచనములన్ మత్తేభదంతంబునన్
నాణెంబుల్ వెదచల్లఁ దీర్చుదురు విన్నాణంబుతో నంగుళ
త్రాణం బంగుళరక్షకం బగుట సిద్ధం బయ్యెఁ దన్నామమున్.

45


గీ.

ఇందు మొదలిటి మూఁడును హేమరజత
మణి గజవిషాణ పాషాణ మద్గుశృంగ
ముల రచింతు రయ్యశ్వత్థదళముఁబోలు
నంగుళీత్రంబు గోధాజినార్జితంబు.

46


గీ.

క్రౌంచచంచుపుటాకృతి గజవిషాణ
ముఖ్యపూర్వోక్తసాధనములను బొడవు
గా యథావిధి రచియింపఁగా నెసంగు
నంగుళీత్రంబు నూతనాభ్యాసములకు.

47


వ.

ఇట్లు బాతుముక్కుకరణిం బురణించు నంగుళిత్రాణంబునకు విధా
నంబు నిరూపితం బగు, నింక హంసపక్షంబుకైవడిం దనరు నంగుళీ
త్రాణంబునకు విధానం బుపన్యసించెద. నాకర్ణింపుము.

48