ఈ పుట అచ్చుదిద్దబడ్డది


జుట్టుములోనఁ గానియెడ శూరులు నాకముఁ జేరఁ బోవఁగాఁ
బుట్టుట యెట్లు త్రోవ పరిపూర్ణదినేశ్వరమండలంబునన్.

88


చ.

శుకముఖ్యద్విజకీర్ణతత్పురవనక్షోణీజపాలీఫల
ప్రకరస్యందిరసైకతుందిలితమై పాథోదబృందంబుధా
త్రికి వర్షించును గాక యున్న లవణాబ్ది న్నీరమున్ గ్రోలి వా
ర్షుకము ల్దియ్యనినీరమున్ గురియునే చోద్యంబుగా కెయ్యెడన్.

89


సీ.

ఒకవటుండే చాలు నకలంకవేదశాస్త్రనిరూఢి బ్రహ్మ నధఃకరింప
నొకరాసుతుఁడె చాలు నుద్వేలశక్తి దిక్పాలురఁ గదిమి కప్పములు గొనఁగ
నొకవైశ్యసుతుఁడె చా లురుసంపదల ధనాధిపు నాదిభిక్షుమైత్రికిని జొనుప
నొకశూద్రసుతుఁడె చా లుర్వీతలం బెల్ల బహుసస్యమయముగాఁ బయిరు సేయ


తే.

నొకరథము సాలుఁ గనకాద్రి కొడ్డు సూప, నొకగజము చాలు దిక్కరిప్రకర మెదుర
నొకహయము సాలు రవిహయాత్యుద్ధతిఁ గన, నొకభటుఁడె చాలు రుద్రుతో నొరయ నచట.

90


చ.

ఎక్కుడు మోహదృష్టి రతి నిచ్చఁ దలంపక వచ్చి వేఁడినం
జక్కనివాఁడు గాఁ డనుచుఁ జక్కెరవిల్తుని మెచ్చ రన్నచో
నక్కడి వారకామినుల యందము వారి విటాళిచందము
న్నిక్కము సన్నుతింప నలనీరజగర్భున కైన శక్యమే.

91


గీ.

అప్పురంబున కధిపతి యై ధరిత్రి, పాలన మొనర్చు నేకాతపత్రముగను
భామినీజనమోహనపారదృశ్వ, మృదులతనుమేజయుఁడు జనమేజయుండు.

92


చ.

ప్రతిదినముం బ్రభాతమునఁ బాఠకగీతుల వీతనిద్రుఁడై
క్షితిసురపాళితో నరిగి చెంతఁ బొసంగెడి గంగలో సమం
చితమతి నిత్యకృత్యము లశేషముఁ దీరిచి గాఁగ పంకజ
ప్రతతులఁ బూజ సేయు నరపాలుఁడు కృష్ణు నభీష్టదైవమున్.

93


తే.

ఆమహీపతి యొకనాఁ డహర్ముఖంబు, నందు నెప్పటికరణి జాహ్నవిని నిత్య
కృత్యములు దీర్చి నగరికి నేగుదెంచి, కొలువుసింగారమై కంతుచెలువు మెఱసి.

94


సీ.

నిండుఁగొల్వునను గూర్చుండ ధర్మజుతోడఁ గార్యము దెలిపెడిగౌరవంబు
దుర్యోధనాదు లాందోళ మొందఁగ విశ్వరూపంబు సూపెడుప్రోడతనము
సంగరంబున ధనంజయరణస్థాయియై ధవళాశ్వములఁ బట్టుదంటతనము
వైరాటిసూతికాద్వారంబునను జక్రహస్తుడై గాచిన యట్టి మహిమ


తే.

తెలియ శ్రీకృష్ణమూర్తిఁ జింతించినట్టి, కొలువుకూటంబులోపల నలువు మీఱ
భద్రపీఠికఁ గొల్వుండెఁ బాండవాన్వ, యుండు జనమేజయక్షమాఖండలుండు.

95


వ.

అయ్యవసరంబున.

96