ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వ.

ఇవ్విధంబున కశ్యపమునివలన సముద్ధరింపంబడిన ధరావరారోహ యద్ధీరాగ్రణి
కిట్లనియె.

156


మ.

అనఘా విప్రులు ప్రోవలేరు నను బ్రోద్యద్బాహుశౌర్యంబుచే
ఘనులౌ రాజులె గాని భార్గవమహోగ్రక్రోధదావాగ్ని ద
ప్పినవార ల్గలరందు నందు నృపతు ల్పేర్కొందు నన్నామము
ల్విని రప్పింపుము వారి ధర్మపరుల న్విఖ్యాతశీలాఢ్యులన్.

157


సీ.

కశ్యపమునినాథ కాచితిఁ గొందఱన్ హైహయులను గుహలందు దాఁచి
పౌరవాన్వయుఁడు విదూరథతనయుండు ఋక్షవద్గిరియందు ఋక్షరక్ష
సౌదానవర్యుండు శక్తిజు శరణొంది దధివాహసుతుఁడు గౌతమునిఁ గొలిచి
గోపాలనముఁ జేసి గోపతి యనురాజు వత్సము ల్మేఁపుచు వత్సనృపుఁడు


తే.

గృధ్రకూటమనెడు గిరిని కోలాంగూల, జాతివలన భూతి జలధిచే మ
రుత్తుసుతులు మువ్వురును బ్రతికిరి వారిఁ, బతులఁ జేయు నాకు భవ్యమతుల.

158


మ.

అని ప్రార్థించిన మంచిదే యని దయైకాయత్తచిత్తంబుతో
మునిచూడామణి శిష్యులం బనిచి సమ్మోదంబుతోఁ దెచ్చి వా
రిని సామ్రాజ్యపదాభిషిక్తుల నొనర్చె న్వారలున్ భూమిపా
లనముం జేసిరి ధర్మ మెచ్చ జన ముల్లాసంబుఁ గాంచె న్నృపా.

159


తే.

విప్రులకు రాజసతుల కావిర్భవించి, రుత్తమక్షత్రియులు ధర్మయుక్తు లగుచు
నంతటను వారిసంతతు లతిశయిల్లె, ధరణి నంతటఁ దామరతంప రగుచు.

160


తే.

భార్గవుం డిప్పుడు మహేంద్రపర్వతమున, నున్నవాఁడు తపోధను ల్దన్నుఁ గొలువ
నాతఁడే గాదె భీష్మకర్ణాదులకును, జాపవిద్యోపదేష్టయై జయము లొసఁగె.

161


మ.

అనఘా యీభృగురామచర్య వినువా రత్యంతపుణ్యాత్ములై
యనిశంబున్ బహుభోగభాగ్యములు దీర్ఘాయుష్యవైదుష్యముల్
ధనదాన్యంబులు బుత్త్రపౌత్త్రులును భద్రంబు ల్మనోభీష్టము
ల్గని రాజిల్లుదు రెందుఁ గాంతురు తుదిం గైవల్యసామ్రాజ్యమున్.

162


క.

అని శ్రీవైశంపాయన, మునిముఖ్యుఁడు దెల్ప విని ప్రమోదాన్వితుఁడై
జనమేజయుఁ డవ్వలికథ, యనఘా వినవలతు దెలుపు మని యడుగుటయున్.

163


ఉ.

తీక్ష్ణమహామహోనిధిసుధీయుత దారకతారదారకా
శ్లక్ష్ణకలావిహార యుడుజాలసమాచ్ఛవిహార యాశ్రితా
భీక్ష్ణముదంచితాత్మ యవిభిన్నదృశోరచితాత్మమేదినీ
రక్షవిధాన దానచతురన్నయశోధన శ్రీయశోధనా.

164