ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

ఒసఁగినఁ గనుఁగొని కనుఁగొన, నెసఁగిన కెంజాయ పొసఁగ ఋషిపతి మద్ధే
నుసమానులె యీధేనులు, మసారమున కెనయె గాజుమణు లెన్నైనన్.

101


తే.

వలదు పొమ్మన విప్రుఁ డావార్తఁ దెలుప, విని నృపాలుఁడు మాతోడ వికటమేల
విప్రుఁ డేమాత్రముననైన వేడ్కఁ జెంద, వలయు ననుమాట వినఁడె భూవలయమునను.

102


తే.

అటులు గాకున్న దనయిచ్చ యాత్మజులకుఁ, జెప్పి పంపిన విన రేమి సేయువాఁడ
ననిన నామాట విప్రుచే నాలకించి, యేల కించిత్తు న న్నెంచఁ డితఁ డటంచు.

103


ఉ.

మున్నుగ ద్వారరక్షుల సముద్ధతసంగరరంగదక్షులన్
ఛిన్నుల సేయు భార్గవుని సేనలు గూడి యెదుర్ప భూధరా
భ్యున్నతమత్తదంతిహయతుంగశతాంగభటప్రతానమున్
ఛిన్నము చేసె రాముఁ డతిభీమకఠోరకుఠారధారలన్.

104


తే.

అంత హతశేషమైన సైన్యంబు గొంత, యెంతయును భీతి నేఁగె దిగంతములకు
నంతయును విని రోషితస్వాంతుఁ డగుచుఁ, జింతఁ జేయుచు మేదినీకాంతవరుఁడు.

105


క.

తనచేతనున్న చాపముఁ, బనిచి నిషంగంబు మెట్టఁబనిచిన నదియుం
జని గొనయ మెక్కి చాపము, దనయంతనె సంధిలె న్శితప్రదరములన్.

106


క.

సంధిలుచు భూనభోంతర, బంధురత న్నిగుడు బాణపంక్తులు దునిమెం
గంధరగణముల సప్త, స్కంధముగతి రాముఁ డల్ల చాపము దునిమెన్.

107


క.

చాపము దునిసిన నిషునిధి, రోపంబులు వెడలి తనదు ఱొమ్మగలింపం
గోపంబున భృగుపతి ప్రతి, రోపంబుల నృపునిశరధి రూపఁడగించెన్.

108


ఉ.

అంతట నర్జునుం డనుప నాయుధము ల్బహురూపధారులై
యంతకదండదారుణములై శతకోటిశితంబులై యహః
కాంతకరోజ్జ్వలంబులయి కాలమహాభుజగాదిరాజదు
ర్దాంతములై హుతాశనకరాళములై తనపైపయిం బడన్.

109


క.

పరశువున రాముఁ డన్నిటి, నిరసింపఁగ నృపతి యణిమనేర్పున నణువై
పరికింపఁగ వచ్చిన దనుఁ, బరమమహాయోగి దెలిసి పట్టఁ దివురుటన్.

110


చ.

దివి భువి నిండియున్న ఘనదేహము మేరులసత్కిరీటము
న్వివిధవిభూషణంబులును వేయివిధంబుల నాయుధంబు ల
త్యవితథతేజము న్మహిమ నంది త్రివిక్రముఁ బోలియున్న న
య్యవనిపుఁ జించె నంచితశరావలి రాముఁ డచంచలాత్ముఁ డై.

111