పుట:Chitta-Ranjana-Dasugari-Jeevitacharitramu.pdf/28

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

25

పించెను. ఈయంతర్జాతీయవివాహమున కనేక విద్వాంసులు, మహామహోపాధ్యాయ పండిత: హరప్రసాదశాస్త్రి మున్నగు గొప్పవారు మెచ్చిరి. హిందూసంఘములో అనేక అశాస్త్రీయమైన దురాచారములు వాడుకలో నున్న వానిని రూపుమాపుటయే ప్రస్తుతదేశభక్తుల ప్రథమ కర్తవ్యాంశమని మన చిత్తరంజనుఁడు గాఢముగ నమ్మియుండెను. అట్లే తనకుటుంబములోనుండి దురాచారమును తొలగించుటకు కంకణము గట్టుకొని మొట్ట మొదట తనకొమార్తెనే అంతర్జాతీయవరునకు అదివఱకు బంధువే కానివాఁడును సజాతి మతస్థుఁడు నగువాని నొక్కని వెదకి యోగ్యుఁడగు అట్టివానికిచ్చి కృతకృత్యుఁడయ్యెను. తనజాతివారు కొంద ఱీసాహసకార్యమునకు తూలనాడిరి. చిత్తరంజనుఁడు చలించ లేదు. తన కొమారునిచే సైతము వైద్యకుటుంబ మొకదానియం దుండి కన్యకను దెచ్చి వివాహమాడించెను.

దేశ భక్తి.

“దేశసేవ జన్మసాఫల్యమునకు మూలము. నాకు దేశనామము తలంపునకు రాగానే భగవన్నామము సైతము స్మరణకువచ్చును,” అని చిత్తరంజనుఁ డొకప్పుడు తన యుపన్యాసమునందు నుడివియుండెను.