పుట:Chitta-Ranjana-Dasugari-Jeevitacharitramu.pdf/25

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

22

ముచేయవలసినంతటి దుస్థ్సితిపాలయ్యెను. ఇందుల కేమాత్రమును వగఁజెందినవాఁడు కాఁడు. చిత్తరంజనుఁడు కోరియున్నచో బంగాళముననుండు అనేక ధనవంతులగు జమీన్ దార్లవలె తానొక గొప్ప భూస్వామియై యుండియుండును. అయిన నిట్టిపదవులన్నియు 'మీసాలపై తేనియ' లని తలంచి చిత్తరంజనుఁడు బీదలపాలిటి కల్పతరువై తాను కష్టించి యార్జించిన యావత్తుధనమును ఆర్తత్రాణత్వమున వెచ్చించి తానిప్పు డొరులకు సకలసంపదల నొసఁగుటకు శక్తియుతుఁడగు నాదిభిక్షువైన శివునివలెనే భిక్షాటన యొనర్పవలసినవాఁ డయ్యెను. త్యాగిగానిదేమోక్షగామి కాఁడుగదా? ఈతని త్యాగమును గుఱించి వ్రాయబూనినచో గ్రంథము విస్తరించును. ఈతని గుప్తదానవిషయమున నొక్క కథ గలదు. ఒకానొకప్పుడు విద్యార్థియొక్కడు కలకత్తానగరమున తన ప్రవేశపరీక్ష రుసుముసైతము చేత లేక నల్లాడుచు ఇల్లిల్లు తిరిగి వేడుచుండగా నొకహితకారి ఆవిద్యార్థిని చిత్తరంజనుని సందర్శించమనెను. వెంటనే యావిద్యార్థి చిత్తరంజనుని గృహమునకుబోయివాకిలి ద్వారపాలకుఁడొకనిని చిత్తరంజనులెప్పుడు మేల్కాంతురు అని యడుగగా దౌవారికు డావిద్యార్థిని కసరిపంపెను. ఈసవిస్తారమును