పుట:Chinnanati Muchhatlu K N Kesari 1999 206 P.pdf/31

ఈ పుట ఆమోదించబడ్డది

చిన్ననాటి ముచ్చట్లు 23

గోపాలాచార్యులుగారు మద్రాసుకు క్రొత్తయగుటచే నేనువారికి కొంత సహాయమును చేయవలసి వచ్చినది. మొదట వైద్యశాల గిడ్డంగి వీధిలో దేవాలయమునకు సంబంధించిన కొట్లలో యుండెను. ఈ వైద్యశాల యెదుటనే నా స్నేహితుడగు అన్నం చెన్నకేశవులుశెట్టిగారి యిల్లు. గోపాలాచార్యులు గారు నివసించుటకు స్థలము లేనందున శెట్టిగారి యింట్లో, ఒక రూమును ఆచార్యులవారికి యిప్పించితిని. అప్పడు నేను నరసమ్మగారికి నెలకు రూ. 10 లు ఇచ్చి భోజనము చేయుచు, రాత్రిళ్ళు శెట్టిగారి యింటిలోనే పండుకొనుచుంటిని. ఆచార్యులవారు, నేను యిరువురము శెట్టిగారి యింట్లోనే యుండుట తటస్థించెను. మద్రాసులో వైద్యవృత్తికి కొంత డంబముండవలయును. ఆ డంబము ప్రదర్శించుటకు డబ్బు కావలయును. ఆచార్యులవారికి వైద్యశాలలో జీతము రూ. 30 లు మాత్రమే. అందువల్ల శెట్టిగారితో చెప్పి వారికి కొంతడబ్బు అప్పు ఇప్పించితిని. క్రమముగా వారు మద్రాసులో పేరు సంపాదించుకొనిరి.

ఆచార్యులవారును నేనును వైద్యశాలలో 4 సంవత్సరములుపాటు సోదర భావముతో కాలమును గడుపగల్గితిమి. ఆచార్యులవారు ఆయుర్వేదాశ్రమమును పేరుతో ఒక వైద్యశాలను స్థాపించి ముఖ్యముగ ప్లేగుమందుల మాహాత్మ్యములను కరపత్రముల ద్వారా ప్రచురించుచు వ్యాపారమును సాగించిరి. ఆ కాలమున బెంగుళూరు ప్రాంతములలో ప్లేగు తీవ్రముగ వ్యాపించియుండెను. ఆచార్యులవారికి ఆంగ్లభాష పరిచయము లేనందున ఈ వ్యాపారములన్నియును నేనే చేయుచుంటిని; గాని నాకు లాభమేమియు లేకుండెను. ఈ కారణములవల్ల నేనే వేరుగ కేసరికుటీర మనుపేరుతో వైద్యశాలను స్థాపించితిని. పనిచేయుచున్న వైద్యశాలలో నేనే మొదట రాజీనామా యిచ్చితిని. పిమ్మట కొంతకాలమునకు ఆచార్యుల వారును రాజీనామా యిచ్చిరి. అప్పటినుండి స్వంత వైద్యాలయములను నడుపుకొనుచుంటిమి.