పుట:Chinnanati Muchhatlu K N Kesari 1999 206 P.pdf/13

ఈ పుట ఆమోదించబడ్డది

చిన్ననాటి ముచ్చట్లు 5

గ్రామానికి భిక్షమునకు వెళ్లేవారు. నాకు ఉన్న ఊరిలో బిచ్చమెత్తుకొనుటకు లజ్జగా ఉండేది. అందుచేత కృష్ణయ్యతో కూడా బసవన్న పాలెమునకు జోలెకట్టుకొని భిక్షమునకు పోతిని. నేను చిన్నవాడిని అగుటచేతను, కొత్తగా వెళ్లుటచేతను, ఆ వూరి అమ్మలక్కలందరూ నన్ను ప్రేమతో లాలించి కృష్ణయ్యకు కంటే ఎక్కువగా నాకు బిచ్చము పెట్టినారు. కృష్ణయ్య జోలెకన్న నాది పెద్దదైనది. మోయ జాలనైతిని. అప్పుడు నా అవస్థ చూచి కృష్ణయ్యగారు నా మూటను గూడ కొంచెము దూరము వారే తీసుకొనిరి. మధ్యాహ్నమునకు ఇంటికి చేరినాము. అప్పడు మా తల్లి నా జోలెమూటను జూచి సంతసించినది; గాని వెంటనే నా చమటలు, అలసట, ఆయాసము చూచి భోరున ఏడ్చినది. తక్షణమే నన్ను స్నానము చేయించి, కడుపునిండ అన్నముపెట్టి నిదురపొమ్మని ఆమె భోజనమునకు పోయినది. ఆమె భోజనము చేసివచ్చే లోపలనే నేను నిద్రపోతిని. నాతల్లి నాకాళ్లవైపున కూర్చుండి ఏడ్చుచుండెను. నాకు మెలకువ వచ్చి "ఎందుకేడ్చెదవమ్మా అని నేనడుగగా నాకాళ్లలో ముళ్లుగుచ్చుకొని యుండుటను చూపినది. నేను భిక్షాటనమునకై పోయివచ్చిన డొంకన తుమ్మ ముళ్లు విస్తారముగా నాకాలిలో విరిగియుండెను. వాని నన్నిటిని ఆమె సూదితో మెల్లగా తీసివైచి మరల ఎన్నడు అట్లా భిక్షాటనమునకు పోనని నాచే ప్రమాణము చేయించుకున్నది.

మా ఇంటి యెదుటనే మా మేనమామగారు ములుకుట్ల మహదేవయ్యగారు నివసించేవారు. కాని వారి సహాయము మాకు ఏమీ లేకుండెను. మా మామగారు ధర్మరాజు వంటివారు. మా అత్తగారు మాత్రము గయ్యాళిగంప. వారి ధాటికి మా మామగారేగాక ఊరివారంతా భయపడేవారు. ఆమె అమిత జగడాల మనిషి ఎవరినైనా తిట్టదలుచుకుంటే తిట్టిన తిట్టు మరల తిట్టకుండా రెండు మూడు గంటల కాలము తిట్టగల శక్తి ఆమెకు గలదు. అందువల్ల ఆమెను చూచిన యింటివారికి, వెలుపలి