పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/848

ఈ పుట ఆమోదించబడ్డది

952

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


తీరుతుంది. వస్తుతస్తు, అట్టి గర్వం అంతకు పూర్వం వున్నా మీ పెండేరపుటుత్సవం నాఁటినుంచేనా లేదని లోకం అంగీకరిస్తుంది. యే మంటారా? నా కట్టి గర్వమే వుంటే జగదతీతత్వస్ఫోరకచిహ్నమైన పెండేరాన్ని నిండుసభలో మీ కాలికి నేనెందుకు స్వయంగా తొడుగుతాను? “క్రియా కేవల ముత్తరం” గదా? దీన్ని గుఱించి "భారతి" యేమందో? చిత్తగించలే దనుకుంటాను.

గురు : భారతిమాటల కేమిలే, తప్పనివిధిచే తొడిగితి వని నా నిశ్చయము. ప్రసిడెంటుగా వచ్చియుంటివి కదా?

శిష్యు : తప్పనివిధేమిటి? యిష్టమేలేకపోతే ప్రసిడెంటుగానూ రాను. నాకంత గండగత్తిరేం వచ్చింది. యిప్పుడు తిరఁగఁబడ్డట్టే, తిరఁగఁబడాలంటే అప్పుడున్నూ తిరఁగఁబడేవాణ్ణే, తప్పకుండా వారించేవాణ్ణి. యిటీవలి చర్యలో వ్రాశాను చూడండి.

గురు : తిరుపతిశాస్త్రి యున్నచో కొంత ప్రసంగము జరిగెడి దేమో?

శిష్యు : వున్నా ఫరవా లేదు. యేమంటారా? అతఁడు నన్ను వ్యతిరేకించే వాఁడు కాఁడు. అట్లేకాకపోతే మీ భారతం మీఁద అతఁడభిప్రాయ మిచ్చేవాఁడేనా? యిదీలా వుండఁగా యింకొక అర్ధార్ధసంబంధంలో కోర్డుదాఁకా వెళ్లక మానతాఁడనుకొన్నారా?

గురు : కృష్ణా పత్రికా సంపాదకీయమును నీవు ఖండింతునని నా పేర వ్రాసికూడ మరల మూకీభావమును వహించితి వేమి?

శిష్యు : మీరు తొందరపడి యేదో ఖండనమని రాస్తారు. దానిమీఁద మఱీ అలుసవుతుంది లోకానికి. వూరుకుంటేనో? గంభీరంగా వుంటుందనే నా తాత్పర్యం గాని అది ఖండింపఁబడేదనే ఆశ నాకు మొదట నుంచీ లేదు. యిప్పడున్నూ లేదు. . గురు : ఆఖండింపఁబడకపోవు టేలాటిదో వివరింపఁగలవా?

శిష్యు : వివరిస్తాను. కాని అది దేవరవారి మనస్సుకు మఱీ కోపకారణ మవుతుందని సాహించేదిలేదు.

గురు : అయినచో కృష్ణా పత్రికాధిపతి నన్ను ద్వేషించువాఁడని వ్రాయుటకు కూడ నీ వొప్పవనుకొందును.