పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/840

ఈ పుట ఆమోదించబడ్డది

944


సంధి మిచ్ఛంతి సాధవః

(2-7-1936 సం||ర ఆంధ్రపత్రిక డైలీ నుండి)

యోగ్యులు తమతో వేఱొకరికిగాని, వేఱొకరికీ వేఱొకరికీగాని స్నేహభావమునే కోరుతారు గాని ద్వేషభావాన్ని కోరరు. యీ భావాన్నే మనస్సులో పెట్టుకొని, శ్రీ గన్నవరపు సుబ్బరామయ్యగారు, మా గురువుగారి "చెరలాట" గ్రంథాన్ని గుఱించి కొన్ని వాక్యాలు వ్రాసివున్నారు. ఆమాటలలో వున్న ముఖ్యాంశం యెంత చర్చించినా వ్యాసకర్తలకు మా వుభయులయందున్నూ వున్న ఆదరాతిశయాన్నే వెల్లడిస్తుంది. కాని అన్యథాగా వుండదు. తుట్టతుదను వ్రాసిన "ఈ వాదాన్ని గూర్చి యింకొక భాగము గూడ ప్రకటింపవలెనా?” అనే అక్షరాలవల్ల చూచినంతలో ఆ పుస్తకం అనుచితంగా వుందనే తాత్పర్యాన్ని వెల్లడించినట్లు కూడా స్పష్టపడుతుంది. వారు మా వుభయులను గుఱించి వ్రాసిన మందలింపునకు నేను మాత్రం దోసిలి వొగ్గుచున్నానని మనవి చేసుకుంటాను. నాకిప్పటికి నెలమీఁద పదిరోజులు కాబోలును తరువాయిగా అఱవైయారు యేండ్లు నిండవచ్చాయి. నేను శ్రీ కృష్ణమూర్తి శాస్త్రుల్లుగారి వద్ద పుస్తకాలు పట్టి యేభైయేండ్లు అతిక్రమించాయి. వారు కొంతకాలమునుంచి నన్ను గూర్చి కొద్దిగానైతే నేమి గొప్పగానైతేనేమి యీసడించడం కర్ణాకర్ణికగా వినడం కలదు. యీ యీసడింపు విద్యకు సంబంధించిందే. అంతట్లో వారు కొల్లాపురం వెళ్లి అక్కడ తగాయిదా తెచ్చుకుని దేశానికి వచ్చి యేదో నిందాగ్రంథాన్ని వక యోగ్యునిమీద యితరులపేరుతో ప్రచురించారు. దానిమీద పలువురు పండితులతోపాటు నేనున్నూ అసమ్మతిని తెలపడం తప్పకపోయింది. దానిమీద వారికి కోపోద్రేకం అతిశయించి పలువురు పండితులతోపాటు నన్నున్నూ దూషించారు. ఆ దూషణాన్ని తెలిపే పుస్తకం పేరే “దురుద్ధరదోషశృంఖలం" అది నేను చూచిన్నీ అందులోవున్న అసత్యాలూ అనర్హపు మాటాలూ గమనించిన్నీ కూడా కిక్కురు మనకుండా వూరుకోవడమే కాకుండా గండపెండేరాన్ని నాస్వంత చేతులతో వారికాలికి తొడిగివున్నాను. ఆశృంఖలంలో నన్ను నిందించిన యితర విషయాలు వదులకున్ననూ వారి విషయంలో నేను వుపకారానికి చేసిన వక యత్నాన్ని అపకారంగానున్నూ నేను సభలో వుపన్యసించని విషయాన్ని వుపన్యసించినట్టున్నూలిఖించారు. యిందు వకటి ముక్త్యాలకున్నూ వకటి పాలకొల్లుకున్నూ సంబంధిస్తాయి. లోకానికి ఆమాత్రం విమర్శనాజ్ఞానం వుండకపోతుందా? అని అప్పుడున్నూ