పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/808

ఈ పుట ఆమోదించబడ్డది

912

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


సభ జరిగి నాలుగేండ్లు కావచ్చింది. అప్పుడు యెవరుగాని ఇంతవఱకు నాకీ కళంకాన్నియెక్కడా ప్రకటించలేదు. ఆ రోజుల్లో గూడా గురువుగారి పెండెరానికన్న కూడా నా ప్రవృత్తినే పత్రికలు శ్లాఘించాయి. అవసరమయితే చూపుతాను. చి|| లII అనే పేరుతో పెద్దవ్యాసంవ్రాసి పెండేరమునూ, గురువుగారినీ, నన్నూ, వెక్కిరించిన ఆంధ్రపత్రికా వ్యాసం కూడా నేను వ్యతిరేక చేష్టలుచేసినట్లు లేశమున్ను సూచించనైనా లేదు. పెండేరపు విషయంలో తన అసమ్మతిని మాత్రమే వెల్లడించింది. యితరుల సమ్మానాలకు వెంబడిగా యిట్టి అసమ్మతులు లేవు. గురువుగా రీ విషయాన్ని బాగా గమనించి పత్రికలలో సమర్థత కుపక్రమించాలి. ప్రస్తుతం నా కొల్లాయిగుడ్డ సంగతి. నాకు సౌందర్యాన్ని బలపరచుకొనే వేషమందాసక్తి బొత్తిగా లేదు. కారణం నేను సురూపులలో చేరేవాఁడను కానని యెఱుఁగుదును. కనుక కొల్లాయిగుడ్డలు వాడుతూవుంటాను. మహాసభలలో కూడా, పనిపడితే పొత్తర్లు మూటగట్టు కోడానికిక్కూడా పనిచేస్తాయని యెవరేనా అంటే దాన్ని నేను "స్వభావోక్తి రసౌ చారు"గా జమకట్టుకొంటాను. నేను హైకోర్డు లాయరు వేషం వేయను. వేసే కవులను ఆ విషయంలో అభినందించనుకూడాను. నేనట్టి వేషం వేసినా అదినన్ను అందగాణ్ణి చేయఁజాలదని నాకు బాగా తెలుసును. బాగా ఆలోచిస్తే నాకు పూర్తిగా తెలిసిన సంగతి యిన్నాళ్లకి యిదిమాత్రమే అనుకుంటాను. భవభూతి యేమన్నాఁడు? శ్లో నాస్మాకం శిబికా...... విద్యా ౽౽నవద్యా౽స్తినఃII అన్నాఁడు. బాహ్యవేషాడంబరాలున్నూ వెనకాల అపహసిస్తూవుండే బిరుదులున్నూవకటే తరగతిలోవని నాభావం. శ్లో. విద్యారూపం విరూపాణాం | కదా! బ్రహ్మంగారి హరికథను గూర్చి కొంచెం నేను యెత్తుకొన్నమాట వాస్తవమే. నిజంగా అది అపహాస్యాస్పదపు వ్రాఁతయే. గురువుగారెఱుఁగ రందామంటేఁ దాని పీఠికలో వారు “యెన్నో సంగతులు తగ్గించి నిలుపుచేసినవే ప్రకటించి" నట్టు స్పష్టముగా కనఁబడుతుంది. యిది నేను సృశించి నందుకు బదులు షష్టిపూర్తినాఁడు నాకు కృతిపెట్టిన పింగళి, కాటూరి, శిష్యుల సంగతి నెత్తుకున్నారు గురువుగారు. వారికి పోలిక తోఁచినందు కనుకోవాలి; ఆకృతిలో కథ నన్ను గూర్చిందికాదు. హరికథలో ప్రతిపాద్యులు గురువుగారేకదా? యింకా యింతటితో వదిలారా? అడివి శంకరరావుగారి నెత్తుకున్నారు. అందుకు యెపుడో వారే సమాధానం యీవలసివుంటే యిస్తారనుకుంటాను. బ్రహ్మంగారు శ్రీ పట్టసక్షేత్రంలో శ్రీ భద్రకాళీ మహాదేవి గురువుగారికి (కలలోనూ గిలలోనూకాదు) ప్రత్యక్షమైనట్లున్నూ ఆపెతో వీరు మాటలాడినట్లున్నూ వ్రాశారు. యిది గురువుగారు చెప్పి వ్రాయించిందా? కాదా? బ్రహ్మంగారి కేలా తెలిసింది? ఆ సమయంలో బ్రహ్మంగారు కూడా గురువుగారి పార్శ్వాన్ని దయచేసివున్నారా? యిట్టి అపహాస్య విషయాలు దానిలోవున్నాయి. సుమారు అఱవైవేల