పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/765

ఈ పుట ఆమోదించబడ్డది

నా పాలకొల్లు ప్రయాణము

869


పస్తాయింపు కలగడంచేత కాఁబోలు దాన్ని ప్రకటించడం మాత్రం జరగలేదు. కాని గురువుగారు మిమ్మునుగూర్చిచాలా కోపంగా యేదో వ్రాసి అచ్చువేస్తూన్నారని తఱచు వారి వారివల్ల వినడం మాత్రం జరిగింది. చెప్పినవాళ్ల నెవరిని గాని గురువుగారు నన్నుగుఱించి యేం వ్రాస్తున్నారు, యేమంటూన్నారు అని మాత్రం నేను తపిసీలుగా అడుగనూలేదు. వివరంగా వాళ్లేవళ్లున్నూ చెప్పనూలేదు. పుస్తకం పైకి వచ్చి నపుడు చూచి అందు గురువుగారు చూపించిన దోషమేమైనా మనం చేసినట్టుంటే క్షమాపణ చెప్పకోవచ్చునని మాత్రం అనుకొన్నాను. అంతేకాని పుస్తకం ఆపివేశారన్న మాటప్పటికి నాకు తెలియదు. పిమ్మట ప్రజోత్పత్తి చైత్రంలో శ్రీ పళ్లె పూర్ణప్రజ్ఞాచార్యులుగారి కాదంబరీ గ్రంథమును శ్రీ గ్రంథకర్తగారి మామగారు మధ్వశ్రీ అవధాని శిరోమణి కాశీకృష్ణాచార్యుల వారికి కృతి సమర్పించే సభకు నే నధ్యక్షుఁడుగా గుంటూరికి వెళ్లడం తటస్థించింది. అక్కడ పూర్ణప్రజ్ఞాచార్యులుగారి సావడిలో కొన్ని పుటలు చినిగియున్న శ్రీ గురువుగారి “దురుద్ధరదోషశృంఖలం" తలవని తలంపుగా నాకు కళ్లఁబడింది. యీ పుస్తకం నేను వారి వజ్రాయుధం పత్రికలో చిరిగిపోఁగా మిగిలిన భాగమే అనుకొన్నానుగాని వేఱేసైజులో వున్నప్పటికీ స్పెషలుగా అచ్చొత్తించినదనే జ్ఞానం నాకు మొదట కలగనే లేదు. ఇది చూచిననాఁడో మఱి రెండుమూఁడు రోజుల్లోనో నేను శాంతివ్యాసాన్ని వ్రాసి త్రోవలో బెజవాడనుంచే కృష్ణకు పోస్టుచేశాను. ఆ శాంతి వ్యాసంలో యీ శృంఖలాన్ని గుఱించిన మాట లుండడానికి కారణం గుంటూరులో నా కది కనపడడమే. దీనికి సంబంధించిన అక్షరాలు కొన్ని శాంతివ్యాసాన్నుంచి వుదాహరిస్తాను. "అది మొదలు నాయెడల విశ్వాసము తప్పి నన్ను కొండొక తరగతిమాటలతో నిరాకరింప మొదలిడిరి. ఈ నిరాకరణమును గూడ నేను గుంటూరికి పోకపూర్వము చూడనేలేదు. అక్కడనే వారి పత్రికలో చదివితిని." నేను వారి పుస్తకమును, పత్రిక యని భ్రమించినట్లు పైనుదాహరించిన అక్షరాలలో తుట్టతుదిమాటవల్ల విస్పష్టంగదా? గురువుగా రపోహపడ్డట్టున్నూదానిని కొందఱు ప్రాజ్ఞులు నివారించినట్లున్నూ నేను ఆ వ్యాసంలోనే వ్రాశాను చూడండి.

“నాయం దిపుడు శ్రీవారికి కోపకారణమేమని చదువరు లనుకోవచ్చును.... ఇటీవల శ్రీవారి యాజ్ఞానుసారముగా నేను పాలకొల్లు వెళ్లి అచట వారి హృదయములో నున్న చొప్పున నుపన్యసింపనేరకపోవుట యొకటియుఁగా శ్రీవారి యక్కరముల వలన నవగతమయ్యెడిని. ఈయపోహమును మIIరా||రా|| నాళం కృష్ణారావుగారు లోనగు తత్రత్యప్రాజ్ఞులు పలుసార్లు చెవినిల్లుగట్టుకొని పోరి మరలించిరి. మరల నాయందు యథాపూర్వముగా అనుగ్రహము కలిగియే యుండిరి.”