పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/750

ఈ పుట ఆమోదించబడ్డది

854

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


అన్న వేమన్నగారి సూక్తిని నాయందుపట్టించడం సుళువు కనుక యీ తోవను గురువుగారు తొక్కేరనుకోవలెనా? యేమనుకోవలెనో నాకు బోధపడడం లేదు. యీ అపవాదాన్ని శ్రీ ముక్త్యాలరాజావారే పోగొట్టడానికి అర్హులు కాఁబట్టి శ్రీవారినే ప్రార్థిస్తున్నాను.

అయితే నేను శ్రీవారి సన్నిధిని శ్రీమా గురువుల కొఱకు పద్యాలు చెప్పి ప్రయత్నించేటప్పుడు యింకా చాలామంది వున్నారు. వారెవరేనా కలిగించుకొంటే కలిగించుకోవచ్చు. అందులో శ్రీయుత హరి నాగభూషణంగారేమి, శిష్యుఁడు వేటూరి ప్రభాకరశాస్త్రియేమి, శ్రీవారి సంస్థానంలో వుద్యోగిగావున్న శ్రీ చల్లా సూర్యనారాయణమూర్తి గారేమి, వీరిలో యెవరు వ్రాసినా వ్రాయవచ్చును. వీరిలో తుట్టతుది వారు మా గురువుగారికి చాలా మిత్రులు, భక్తులు, మొదటి యిరువురున్నూ కాని ఇటీవల నిన్న మొన్న నాగభూషణంగారు శత్రుకోటిలో చేరినట్లు వజ్రాయుధప్పత్రిక వల్ల తెలుస్తుంది. ముక్త్యాల గాథకు పూర్వమే ప్రభాకరశాస్త్రికిన్నీ గురువుగారికిన్నీ ఏదో వాదోపవాదాలు జరిగినట్లు పత్రికలో చదివినట్లు జ్ఞాపకం. అందుచేత వారిమాట అంత ప్రమాణం కాదనుకొంటాను. తుట్టతుది వారిక్కూడా యీలాటి దేదో వున్నట్లే యెప్పుడో గురువుగారి ప్రసంగం వల్ల తేలినట్లు జ్ఞాపకం. యెవరెందుకు వ్రాయాలి, గురువుగారు వ్రాసిన పొత్తములో వున్న సంగతులు నిలిచేవనే నమ్మకం గురువుగారికే లేదేమో అని వారు దాన్ని సర్వ సంసిద్దంచేసి కూడా ప్రకటించకపోవడం వల్లనే బుద్ధిమంతులు తెలుసుకుంటారేమో! యింకా దానిలో నన్ను గుఱించి చిత్రవిచిత్రంగా గురువుగారు లిఖించారు.

“వనంవారు, కొల్లాపురమునకు తీసికొనివెళ్లి మహారాణిగారిచే వేయిన్నూట పదాఱు లిప్పింతునని చెప్పి యున్నారేమో! ఆహా! ధనమెంత చెడ్డది!"

చూచారా? కాకున్నధనాశ యెంతచక్కగా వివరించారో గురువుగారు? “మాతాపుత్ర విరోధాయ హిరణ్యాయ నమః" కదా! యింకా చిత్రమైన మాట లున్నాయి. చూడండి. “ఈవ్రాఁత చిలకమర్తివారి యుపన్యాసధోరణిం బోలియున్నది. బంధుత్వమూరక పోయినదికాదు." నిజమే. నా రెండవతోబుట్టువు చిలకమర్తివారి యాఁడుపడుచే. బంధుత్వము నేను గురువుగారికి జంకి వదలుకుందా మంటే వదులుతుందా? యిదిగాక నాకు శ్రీ చిలకమర్తి లక్ష్మీనరసింహంగారి యెడల నిజమైన ప్రేమకలదు. నా సమకాలికులలో ఆయన కవిత్వమునందేమి, శ్రీ దాసు శ్రీరాములగారి కవిత్వమందేమి, ఆదిపూడి ప్రభాకరరావుగారి కవిత్వమందేమి, మఱి కొందఱి కవిత్వమందేమి నాకెంతో అభిమానం.