పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/739

ఈ పుట ఆమోదించబడ్డది

నా ముక్త్యాల ప్రయాణము

843


పాపం, ఆ గృహస్థు నా నల్లమందు మూలాన్ని ఆ పూజ కొంత త్వరలో తేల్పించాడు. ఆ దంపతుల కావేళ నా ఆశీర్వచనం తటస్థించడానికి మిక్కిలిగా ఆ యింటివారు సంతోషించారు. నాకు క్రొత్తబట్టలిచ్చి సన్మానించినట్లుకూడా జ్ఞాపకం. పొద్దు పోయినా పిండివంటతో భోజనం. యీ మాట "బ్రాహ్మణో భోజన ప్రియః" కింద జమకట్టుకోకుండా చదువరులను కోరుచున్నాను. యెందుకురాయాలంటే, యేదేనా కార్యార్థం బయలుదేఱి నప్పుడు మొట్టమొదటి మకాంలో శ్రమలేకుండా భోజనభాజనాదులు తటస్థించడం భవిష్యత్కార్యానికి మంచిదని శకున శాస్త్రజ్ఞులు చెపుతారు. చెప్పడమేకాదు, ఇది తప్పకుండా అనుభవానిక్కూడా వస్తుంది. కాబట్టి ఆలాంటి అలవేళ అప్రయత్నంగా భోజనం దొరకడమేకాకుండా వరలక్ష్మీవ్రతం చేసుకుంటూ వున్న నూతన దంపతులను చూడడం, ఆ సభలో సన్మానించబడడం, ఇదంతా భావికార్యానికి శుభసూచకం గదా! అందుచేత మనస్సుకు చాలా ఆనందం కలిగింది. భోజనమయింది. గుఱ్ఱపు జట్కాలమీఁద ముక్త్యాలకు ప్రయాణం సాగించాము. తోవలో వెనుకటి యేఱుమోస్తరుదే యింకోయేఱు అడ్డం వచ్చిందిగాని, దాని వడి చాలా తగ్గిన స్థితిలో వుండడంచేత సునాయాసంగానే దాఁట నిచ్చింది. సంధ్యాకాలానికి లోగానే ముక్త్యాల చేరుకొన్నాము. యెడ తెరిపిలేకుండా సంగీత సభలేమి, సాహిత్య సభలేమి, జరుగుతున్నాయి. నేనక్కడికి వెళ్లడం కొత్తయినా, కొత్తనిపించనేలేదు. యెందుచేత? బందరు బందరంతా అక్కడ ప్రత్యక్షమయింది. శిష్యులు, అవ్వారి సుబ్రహ్మణ్యశాస్త్రి, వేటూరి ప్రభాకరశాస్త్రి లోనగువారంతా అక్కడే వున్నారు. హరినాగభూషణంగారిని చెప్పనే అక్కఱలేదు. ఆయనకు గుండెకాయగా వుండే వేమూరి నారాయణరావుకూడా కనపడ్డాడు. పై వాళ్లంతా కనపడడం వకయెత్తున్నూ, ఈనారాయణరావు కనపడడం వక యెత్తున్నూ యేమంటే; యితఁడు మాబోట్లవలె ధనాపేక్షతో వకచోటికి రాఁదగ్గవాఁడు కాఁడుగదా? హై ఫేమిలీవాఁడు, పూర్వమంతకాకున్న అప్పటికిక్కూడా “చాపచినిఁగినా చదరంత” ఐశ్వర్యంలో వున్నాఁడు. యిక్కడి కెందుకు రావాలి, అనుకొన్నాను. యీ సంశయం కొందఱివల్ల తీరింది. యీ వుత్సవాలకీ యీసభలకీ ముఖ్యకారకుఁడు యీ వేమూరి నారాయణరావే అని తెలిసింది. యితఁడు నా బందరు శిష్యులలో నాయందు మిక్కిలీ అభిమానం కలవాఁడు. దేవీభాగవతాన్ని అచ్చువేయడానికి యావత్తు ధనమున్నూ తానే యివ్వాలని సంకల్పించుకొన్న భక్తుఁడు. అయితే నేను అవసరమైతే పుచ్చుకొందామని అనుకొనేవాణ్ణి. భగవంతుఁడు అట్టిలోటు లేకుండా మా పుస్తకాల మీఁద వచ్చే ద్రవ్యంతోనే ఆ ముద్రణాన్ని నెఱవేర్చాడు. ఆ హేతువుచేత యితని ద్రవ్యాన్ని నేను పరిగ్రహించలేదు. గాని అతని లోపంవల్ల మాత్రం కాదు. తుట్టతుద కేలా అయితే యేమి కొంత ద్రవ్యం యితనిది నేను పరిగ్రహించడం కూడా జరిగినట్లే