పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/729

ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీపాదగురువులకడ నా శుశ్రూష

833


సీసపాదమును మాత్రముదాహరించి, జాతకచర్య నుండి నేను శ్రీశాస్త్రుల వారివద్దఁ జేసిన విద్యాభ్యాసము నుదాహరించి, తుట్టతుదను 'నైషధము శ్రీ శాస్త్రులవారి యొద్దనే కాదు, మఱియొకరి యొద్దఁగూడ నిప్పటికి వేంకటశాస్త్రి చదువనే లేదు, ఇఁకముందు చదువవలసియుండును. ఆ యీ యంశములకు శ్రీ శాస్త్రులవారు వేంకటశాస్త్రిని కృతఘ్నుఁడని యందురో, యే మందురో 57వ పుట 11వ పంక్తిలోని గాదె జగన్నాథస్వామి గారి పద్యములోఁ జూడఁగోరెదము.” ఇత్యాదిగాఁ గొన్ని వాక్యములు వ్రాసి గీరత ద్వితీయ భాగమగు గురుదక్షిణ పీఠికలో, ఆఱవపుటలో విమర్శించి యున్నాను. అయ్యది 1913వ సం|| అచ్చయియున్నది. దీనిం గురించి శ్రీ శాస్త్రులవారు దేనిలో నేని ఖండించుటగాని, ప్రత్యక్షములో నాతో నీవు వ్రాసినది సరికాదని మందలించుట గాని చేసినట్లులేదు. ఇప్పటికిది ప్రకటింపఁబడి 22 సం!! ములు దాటవచ్చినది. వారిట్టి విషయములలో జోక్యమునే కలిగించుకోనివారని యనువారుండరు. వజ్రాయుధమవ్వారికి బాధకమగును. ఇఁక నొకటి. అప్పుడు నేనా యక్షరములు చాలా ధైర్యముతోడనే వ్రాసినాను. శ్రీ శాస్త్రులవారి వలన వెం||రా||లో వారి తరఫువారో, విని వ్రాసిన వ్రాఁత మాత్రమది కాదని నాకు పూర్తిగా నమ్మకము కలదు. కావుననే నేనంత ఖండితముగా వ్రాయఁ గల్గితిని. ఇటీవల శ్రీ శాస్త్రులవారి "మాఘ కావ్యము వఱకు" అను నక్షరములు చూచినది మొదలు ప్రమాద వశమున శాస్త్రులవారట్లు పలికి యుందురని కొండొక యనుమానింపవలసిన వాఁడనైతిని. శాస్త్రులవారు కొల్లాపురపు ప్రయాణము వెళ్లుటకుఁ బూర్వము నా యందు మిక్కిలి అభిమానము కలవారనుటకు సందియము లేదు. ఆ ప్రయాణము వెళ్లివచ్చిన కొలది రోజులలో నా యందు మిక్కిలి కోపముద్భవించినది. ఈ కోపము "శాంతి" వ్యాసము తెలుపును. ఈ హైదరాబాదు యుత్తరము ఆ ప్రయాణమునకు చాల నిటీవలిదే. ఈ యుత్తరపు తేదీ : 26-9-32 సం|| రము కదా. కొల్లాపుర ప్రయాణము 1930 సం||లో జరిగినది. ఈ యంశము "శ్లోక పంచక నిరాకరణము" అను పొత్తపు ముఖపత్రము వలన నవగతమయ్యెడిని. ఏదో కోపమున్నట్లు ఉదాహరించిన ఆ యుత్తరములోని కొన్ని వాక్యముల వలన నెట్టి మూర్ఖునకేని అవగతమయ్యెడిని. మరల నా యుత్తర మొకమాఱు తిలకింపుcడు అయినను శ్రీశాస్త్రులవారు మాత్ర మసత్యము వ్రాయసాహసింపరాదు. నేను సర్వత్ర మహాసభలలో శిష్యుఁడనని ఢంకామీఁద దెబ్బగొట్టి చెప్పుచుంటిని. గ్రంథములలో వ్రాయుచుంటిని. కుమారసంభవ మేఘసందేశములు చదివిన నొకటియు, మాఘమువఱకుఁ జదివిన నొకటియునా? అయినను కోపమట్లు తోఁప నీయలే దనుకోవలెను.