పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/724

ఈ పుట ఆమోదించబడ్డది

828

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి

“ఇఁక కాజులూరి విద్యార్ధిత్వం. ఆ వూళ్ళో మేఘసందేశ పూర్వ భాగంలో తరవాయిమాత్రం జరిగింది. చదరంగంలో కొంత పాండిత్యం అతిశయించింది. సులక్షణ సారం స్వయంగానే చూచుకొని కవిత్వం పద్యాల్లో కూడా చెప్పడం మొదలు పెట్టేను. ఆ వూళ్ళో ముగ్గురు గురువులు. రేగిళ్ల కామశాస్త్రులుగారు, పప్పు సోమయ్యగారు, పప్పు సోమనాథశాస్త్రులుగారు. (పద్యములోని “సోములు" అనుచోట. ఏకశేషవలన నీ యుభయులని గ్రహింపవలెను) వీరెవరున్నూ కవులుగారు. మొదటి గురువు భుజంగరావు పంతులుగారు గ్రంథాలేమీ వ్రాయలేదుగాని, వారు మాత్రం కవులే. తరువాత, కాటవరంలో శుశ్రూషింపఁబడ్డ గురువులున్నూ (శ్రీపాద కృష్ణమూర్తిశాస్త్రులవారు) కవులే. వారి వారి వద్ద నేను కవిత్వానికి సంబంధించిన కృషి చేయలేదు. ఏదో తోచినట్టు అల్లడానికి మొదలు పెట్టే నన్నదే ముఖ్యాంశం. అందుచేత లక్షణంలో యెన్నో సంశయాలు కలుగుతూ వుండేవి. యెవరేనా తటస్థించినప్పుడు కనుక్కుంటూ వుండేవాణ్ణి." (నవంబరు 10వ తేదీ 1934 సం!! కృష్ణ చూ.) అయ్యా! కాజులూరి విద్యార్ధిత్వములో విశేషాలు వ్రాయుచు వ్రాసిన కొన్ని మాటల వలన నేను కవిత్వ లక్షణము గురుముఖము వలనఁ జెప్పికోలేదని తేలుచున్నది గదా. దీనిని మనస్సునందుఁ బెట్టికొని నాలుగవ చరణములోని చామర్లకోట విద్యార్ధిత్వమును జిత్తగింపుఁడు.

(జాతకచర్య పూర్వార్ధము నుండి)

"క. ప్రతివాది భయంకర వంశతిలకుఁడు..... రాఘవా
     ర్యుఁడు........ శిష్యతతికిఁ బాఠములుచెప్పు...."

"చ. . ఇట కేగుదెంచితిమి వ్యాకరణంబు పఠించునిచ్చ నాఁగను
      మహనీయుఁ డవ్విబుధ కాంతుఁ డొకించుక నవ్వి యిట్లనున్”

“గీ. ఏమి చదివితి రీవఱ కెద్దివాస | మనుఁడు యానాము కాపుర మనఘ
     నాకు మేఘసందేశమున సాము మిగులు కలదు.”

చదువరులారా! కాజులూరినుండి కథ చామర్లకోట వచ్చినది. చామర్లకోట వచ్చునప్పటికి మేఘ సందేశములో సగము మిగులున్నదనఁగా, పూర్వ మేఘమనెడి ప్రథమ సర్గము మాత్రమే అయినదనుట వలన, ఉత్తరభాగమగు రెండవ సర్గము చామర్లకోటలో మొదలు పెట్టి చదువవలసియున్నదనుట స్పష్టము. కాజులూరికన్న పూర్వ విద్యార్ధిత్వము కాటవరములో శ్రీపాద కృష్ణమూర్తిశాస్త్రులవారి వద్దనే చేయఁబడినది. అక్కడ మేఘసందేశ మెంతవరకుఁ జదువఁబడినది?