పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/714

ఈ పుట ఆమోదించబడ్డది

818

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


ఆయా ప్రభువుల భాషలోని కొన్నిమాటలు దేశభాషలలోకి చేరినవన్న విషయం ఈ సుజనశిరోమణిగారికి తెలియనేలేదా? అయ్యో? యెంత వివేకము. ఇదిన్నీ కాక ఆ మాట కవిత్వంలో వాడినది కూడా కాదు కదా? ఈ ప్రేక్షకుడు నిజమైన పేరు ప్రకటించినప్పుడు బోధించవలసింది బోలెడున్నది. ఇప్పుడు తెల్పి ప్రయోజనం లేదు. కనుక ప్రస్తుతంలోకి దిగుదాం. చదరంగపాట సందర్భంలో మా పిల్లల పాండిత్య లోపాన్ని చెపుతూ శాఖాచంక్రమణంగా కొంత నడచింది. తేలినసారం మామేనగోడలి కొడుక్కు సంస్కృతాంధ్రములలో ప్రవేశం తక్కువనిన్నీ ఇంగ్లీషే మాత్రమో కంగాబంగావచ్చుననిన్నీ మాకుఱ్ఱకు సంస్కృతాంధ్రాల్లో తగుమాత్రం ప్రవేశం వుందిగాని యింగ్లీషు ఏ.బీ.సీ.డీ.లు కూడా తెలియవనిన్నీ తెలుసుకొని తరవాయి ఆలకించండి. ఈ సందర్భం యిలావుండగా ప్రేక్షకుడుగా రెల్లా వ్రాశారో ఈయక్షరాలు కూడా పరిశీలించి పిమ్మట కథాభాగాన్ని వినండి. "ఆంధ్ర, ఆంగ్ల, గీర్వాణభాషలు మూటియందును అవధాన మొనర్ప సమర్థులమని సెలవిచ్చి" ఈ సెలవిచ్చిం దెవరు? అవధానులు కదా? అందొకనికి ఏ. బీ.సీ.డీ. లేరావే? ఎట్లు సెలవిచ్చెనో? ఈ మొదలగు కొన్ని పంక్తులవలన ఈ ప్రేక్షకుడు సదుద్దేశముతోనే వ్రాయబూనిన ట్లెంత నటించినను లోలో దురుద్దేశము బోలెడున్నట్లు పరిశీలకులకు బోధపడి, ఈయన "అధోముఖీస్వయం రంద్రీ" అను శ్లోకాన్ని జ్ఞప్తికి తేకమానరని సూచించుతూ ప్రస్తుతాన్ని వ్రాసి ముగిస్తాను. ప్రస్తుతం, మాకుఱ్ఱలు మా అభిప్రాయానికి భిన్నంగానే అవధానాన్ని మొదలుపెట్టి చేస్తూన్నారన్నదే. మా అవధానాన్నివీళ్లు చూడడానికి లేశమున్ను అవకాశం లేదు. ఎందుచేత వీళ్ల పుట్టుకకు సుమారు యిరువదియేండ్ల క్రితమే మేము అవధాన సభల నుండి విరమించినట్లు లోకమెఱుగును. పోనీ? వీళ్ల కుతూహలాన్ననుసరించి ఆ యీ రహస్యాలు బోధించరాదా? అంటే నిన్నమొన్నపది హేనేండ్లు దాటిన మాకుఱ్ఱనికి నేటికి నాలుగేండ్లు సుమారు నుండి మిక్కిలి అనారోగ్యస్థితిలో వున్న నేను దీన్నెట్లు బోధింతును? ఇదిగాక చిరకాలంనాడే ఈ విద్యయందు మాకనాదరం. అందులో ముఖ్యంగా నాకనాదరం కలిగినట్లు నాముప్పది మూడు వత్సరముల ప్రాయమున చెప్పిన యీ పద్యమువల్ల లోకము తెలిసికోకపోదు.

ఉ. దొమ్మరిసానియెంతయును దుడ్కుమెయిన్ గడనెక్కియాడుపో
    ల్కిమ్మతిబల్మికల్మి గడుగీరితికై యవధానముంబొన
    రమ్మనుజుండు దీనినొకచోద్యముగా గణియింపబోక స
    త్సమ్మతిగా నెసంగు కవితారసమున్ జవిజూడుభూవరా.