పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/709

ఈ పుట ఆమోదించబడ్డది

మనుగుడుపు

813


సభకు రావాలన్నారు. వోపిక లేదన్నాను. వూరికే కూర్చోవడమే అన్నారు. సరే అన్నాను. పెద్ద సభ జరిగింది. మా గురువుగారు శ్రీపాదవారు అగ్రాసనాధిపతులు. కవిత్వాన్ని గుఱించి వుపన్యసించాను. ఇంటికి వెళ్లాలనుకుంటే, విశాఖపట్నాన్నుంచి లక్ష్మీకాంతం బందరులో 4వ తేదీని మీటింగుకు రమ్మని వ్రాసినట్లు యింటిదగ్గిఱనుంచి కబురు. తుదకు యిక్కడికి బయలుదేరేను. ప్రయాణం వైఖరి వక మోస్తరుగా వుంది. చూస్తే యేలావుందంటే, మొదట చిక్కుగా వుండేటట్టు కనపడి తుదకి, మంచిగా పరిణమించేటట్టు కనపడింది. తోవలో వేంకటేశ్వరరావు దీపావళికి స్వగ్రామం వెడుతూ రైల్లో నూజిళ్లదగ్గఱ కనపడ్డాడు. ఇది కొంత శుభసూచకం. వెనక్కి వచ్చాడు. యింటి వద్ద నుంచి రప్పించవలసిన వాళ్లని రప్పించాడు. అనుకున్న సభ నేడు జరిగింది. మిమ్మలి నందఱిని మళ్లా సంవత్సరానికి చూచి ఆనందించే భాగ్యం కలిగింది. సర్వేజనా స్సుఖినోభవంతు. స్వస్తిప్రజాభ్యః కథ కంచి కెళ్లింది. మనమింటికి వచ్చాం.


★ ★ ★