పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/687

ఈ పుట ఆమోదించబడ్డది

పండితరాయలు : కాళిదాసు

791

యింకా జ్ఞాపకం తెచ్చుకుంటే కొన్ని రాకపోవు. ఒక్కొక్కదానికి కొంత చరిత్ర వుంటుంది. తెనాలి రామలింగం, అడిదం సూరకవి, తురగారామకవి, రేకవల్లి సోమకవి, లోనైనవారి చరిత్రలు శ్రవణపేయంగా వుంటాయి. సోమకవిగారు చాలా పెద్దవిద్వాంసులు కూడాను. అనకాపల్లిలో స్కూలుటీచరుగావున్న శ్రీ బులుసు పాపయ్యశాస్త్రిగారివల్ల ఆయీ రేకవల్లివారి చమత్కార విశేషాలు నేఁటికి 50 సంవత్సరాలనాఁడు వినివున్నాను. “కవుల కతలకు రాజుల కతలు లొచ్చు" క్రమంగా కథ కథాంతరంగా మారింది. నామరూపాలుగల యేకవిన్నీ నాకబలి పళ్లెపు సంభావనలకు వెళ్లుట లేదనిన్నీ మ. బరువైతోచుకుటుంబ రక్షణకుఁగా... పిండిప్రోలు లక్ష్మణకవిగారు మాత్రం వెళ్లినట్లు వినికిడి వుందనిన్నీ వ్రాస్తూమాఱు పుంతలోకి కాలుపెట్టి నడుస్తూన్నాం. శిష్టువారు విద్వత్కవులలోవారు. తెలుఁగు కవిత్వంకూడా అలవోకగా రచించినా వారికి సంస్కృతం ప్రధానం. తెలుఁగులో చిరకాలంనిలిచివుండే కావ్యమేదీ రచించలేదు. లక్ష్మణకవిగారుకూడా డిటోలో వుండవలసేవచ్చేది. కాని రావుదమ్మన్న గారి ధర్మమా అని వారు తమ భూమి జబరుదస్తీ మీఁద అపహరించిన కారణంచేత వొకద్వ్యర్థికావ్యం రావణదమ్మీయం అనే నామాంతరం కల లంకావిజయం సుమారు రెండు మూడువందల పద్యాలు వ్రాయడంవల్ల వాఙ్మయంలో ఆయన పేరు శాశ్వతంగా వుండగలదని నాదృఢవిశ్వాసం. 'శిలసంహితకు' దీటుగావుండే వచనం యెంతరచించి బీరువాలు నింపినా ప్రయోజనం నాస్తి అని అన్యత్ర అసకృదావృత్తిగా వ్యాఖ్యానించేవున్నాను. విద్యార్థిదశలో తప్ప పిమ్మట నాకబలి పళ్లెపు సంభావనలకు వెళ్లలేదు. ఆ సంభావనలయందు మాకు గౌరవంలేదన్న సంగతి కాకినాడ శతావధానంలో చెప్పిన ఆ యీపద్యంవల్ల తెల్లమవుతుంది.

క. నాకబలి పళ్లెరమ్ముల
   నాకటజీవించు కుకవులరుగుదురె? లస
   న్నాకనిలయ కవిసమ కవి
   నాకాధిపులున్న సభకనఘ? భీమేశా.

మా విద్యార్థిదశపిమ్మట యే రెండుదశలో ఆయీ నాకబలి సంభావనలు కోమట్లు జరిపి అంతల్లో యేదో, కర్ణాట కలహం కల్పించి ఆకలహం కోర్టుదాకా వెళ్లేటట్టుచేసి ఆఖరికి, మూలచ్ఛేదీ తవ పాండిత్య ప్రకర్షః అనిపించారు. ఆయీమూలచ్ఛేదం చేసిన గౌరవం పిఠాపురందాపునవున్న గొల్లప్రోలు కోమట్లకు దక్కింది. ఆయీ సంభావన యిచ్చేవారూ పుచ్చుకొనేవారూ “కైకురు బొయికురు" లాడుకోవడం ప్రతి పెళ్లిలోనూ వున్నదే యెక్కువ గొప్పగా సత్కరించాలని ప్రతిగ్రహించేవారు, తక్కువగానే కాని యెక్కువ యిచ్చేది లేదని దాతలు, ఆయినా వాదం క్రమంగా చిలికి చిలికి గాలివానగా పరిణమించి