పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/685

ఈ పుట ఆమోదించబడ్డది

పండితరాయలు : కాళిదాసు

789



సీ. పండితులకు గౌరవము చేయుటకు మంచి
          పండితుల్ దగ్గర నుండవలయు
    నుండిననేమి ఆయుండు పండితకోటి
          పరులయున్నతి సహింపంగవలయు
    సైచిననేమి ఆ సత్పండితులమాట
          లింపుగా రాజు మన్నింపవలయు
    మన్నింపనేమి ఆ.మన్ననలకు వద్ద
          నున్న దివాను దానొప్పవలయు

గీ. నిన్నియును గల్గు రాజవీవేయటంచు
    వచ్చినారము లేకున్న వత్తుమయ్య?
    దానరాధేయ కవి సముదాయగేయ
    పండిత విధేయ రామ భూపాలరాయ,

విషయం విషయాంతరంలోకి దూకుతూవుందా? లేదు - దాతయైన ధనవంతునకు ఆ యీసీసంలో వుట్టంకించిన సామగ్రి వున్నప్పుడే ఆ యీవి కీర్తి సంపాదక మవుతుందిగాని యిందులో యేవొకటి లోపించినా అది డబ్బిచ్చి తద్దినం కొని తెచ్చుకొన్న లోకోక్తికిగురి కావలసివస్తుంది. అయితే దాతకన్న లోభియే స్తుతిపాత్రుఁడా? అంటే కాఁదుగాని దాత జీవితం యెన్నో చిక్కులతో నిండి వుంటుంది. కనక జాగ్రత్త యెక్కువ అవసరమని హెచ్చరించాడు.

“సీ. ఈడిగ ముత్తికి జోడు సేలువులిస్తేను
            కురువగంగికి జరీకోకలిస్తేనూ

ప్రయోజనంనాస్తి" అని దాతకు బాగా తెలిసివుండాలి. మా చిన్నతనంనాటికి అమల్లోవున్న నాకబలి పళ్యాలను గూర్చి వ్రాసి మఱీ విషయాంతరం రాస్తాను. అది యేమిటంటే-కోమట్ల యింట వివాహం జరిగినప్పుడు కవులకూ; గాయకులకూ, తోలుబొమ్మలవాళ్లకూ, భాగవతులకు పెళ్లివారి చేవనుబట్టి సత్కరించడం వుండేది. యేనాఁడు ప్రారంభమైనాయో యీ మామోళ్లు, వీటికి ఆనాఁడు వాళ్ల గ్రామంలో పట్టాలుకూడా యిచ్చివున్నారు. జమీందారులపన్ను కంపల్‌సరీగా యిచ్చుకోవడం యేలాటిదో ఆయీ నాకబలి సంభావనకూడా ఆలాటిదిగానే వుండేది. తెలుగు దేశంలోనేకాని అన్యత్రా యీ నాకబలి బాధ వున్నట్టు తోఁచదు. మా (తి. వెం.) విద్యార్థిదశలో ఆ యీ నాకబలి పళ్లెం యెత్తడానికి రెండు మూడు చోట్లకుమేమూ వెళ్లడం జరిగింది. కవిత్వం చెప్పేవాళ్లువుంటే ఆ పళ్లెం వాళ్లే యెత్తడం; లేని పక్షంలో కవిత్వంచెప్పేవాళ్ల వంశంవాళ్లు, వీళ్లూ వాళ్లూకూడా