పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/666

ఈ పుట ఆమోదించబడ్డది

770

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


మాత్రమే బేవారసాస్తినివలె యెవరి మట్టుకువారు మావాఁడే అనడానికి అవకాశం వుందికాని తదితరులనుగూర్చి అనడానికి అవకాశంలేదు. యిప్పుడు నేను భట్టుమూర్తిని మావాఁడంటే నే నాకులంలోకి చేరవలసి వస్తుంది. కాని అందుక్కూడా సిద్ధపడే వ్యక్తులు కొందఱు వున్నారు. దానిక్కారణం అతనికవిత్వమందుండే గుణమే. "కవీనాం కో దోష స్సతు గుణ గణానా మవగుణః" అన్నాఁడు మురారి. కవులంతా రాముణ్ణే ప్రేమించినట్లు నన్నయ్యనీ ప్రేమిస్తారు. అతఁడు భిక్షాప్రదాత, “సీ. నన్నయకవి పెట్టినాఁడుకదా? తిక్కనాదికవీంద్రుల కాదిభిక్ష" నన్నయంటూ పుట్టకేపోతే యేంజరిగేదో? అప్పుడు యావత్తుభారమూ తిక్కన్నగారిమీఁదే పడి భిక్షాప్రదాత యీయనే అయేవారు. ఒక్కచేఁతిమీఁదుగా రచించినట్లయేది. 15 పర్వములు రచించిన సోమయాజులుగారే ఆమూఁడు పర్వాలూ కూడా రచిస్తే అని విచారపడేవారున్నూ లేకపోలేదు. అట్లెందుకు జరగలేదో అది మనకు గోచరించేది కాదు. ఆయన ఆకాలంలో యెవరేనా యీప్రశ్నవేస్తే యేమని జవాబిచ్చేవారో తిక్కనగారు. ఆ జవాబు పుక్కిటి పురాణంగానేనా చెప్పుకొనేవారు కవులలో వున్నట్లు లేదు. “అం దాదిదొడంగి మూఁడు కృతులాంధ్రకవిత్వవిశారదుండు విద్యాదయితుం డొనర్చె మహితాత్ముఁడు నన్నయభట్టు దక్షతన్" అనిమాత్రమే సోమయాజులు గారు వ్రాసి వూరుకున్నారు. యిందులో వేసిన విశేషణాలు వొకటి ప్రాసక్రింద రెండుయతిక్రింద జమకడితే మిగిలేదల్లా, నన్నయ్యభట్టుమాత్రమే. “దక్షత్రన్" అనేది పాదపూరణార్థమైనా కావచ్చును. ఆయన్ని ద్వేషించే వారికిదే మార్గం. శివకేశవులకు పరస్పరద్వేషాలులేనట్లే నన్నయతిక్కనలకున్నూ లేవు. వారు సమకాలీనులు కారుగదా? నన్నయ్యగారియందు యితరకవులతోపాటు తిక్కన్నగారికి పరమాదరమే అని మన మనుకోవాలి. ఆయీ అంశమును తిక్కన్నగారి ప్రయోగాలుదాహరించి చర్చిస్తే కవిలోకానికి కొంత వుపకరిస్తుంది గాని అంత వోపికగాని, కొంత వోపికగాని నాకులేదు. యీ వ్రాఁత ఆకాశపురాణపు వ్రాఁత. కొందఱు నన్నయ్యగారి ద్రౌపది, తిక్కన్నగారి ద్రౌపది అంటూ విడదీసి వారి వారి అభిప్రాయాలు ప్రచురిస్తారు. ఆయీ విషయం బొత్తిగా నిరాధారమని మన్మిత్రులు సతీర్థులు కాశీభట్ల సుబ్బయ్య శాస్త్రులవారు పెద్దవ్యాసం వ్రాసి ఋజువు పఱచినారు. ద్రౌపది వ్యాసభట్టారకునిదే గాని యిం దెవ్వరిదిన్నీ కాదని నే ననుకుంటాను. కొంచె మించుమించుగా అనువదించడం అనువాదకుల ఆచారం. అంతమాత్రంచేత వారికి వీరు వంకలు దిద్దినవారుకారు. అట్లు వ్రాయుట వ్యాసభట్టారకుని నిందించుటే.

ప్రసక్తానుప్రసక్తంగా చాలాదూరం వచ్చాం. వాల్మీకి వ్యాసుల ద్వారా పరిశీలించినా బ్రాహ్మణేతరులకూ కవిత్వానికీ చుట్టఱికం ఉంటుంది. అప్పకవివ్రాఁత స్థూలదృష్టిప్రయుక్తం. యింకో మాట వ్రాయడం మఱిచాను. యేదో శాసనంలో భారతాన్ని రాజనరేంద్రుఁడే