పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/652

ఈ పుట ఆమోదించబడ్డది

756

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


ఇట్టి ప్రసంగం తప్పు, కూడదని మందలించడానికి యెవరేనా పెద్దలు సాహసిస్తే వారినికూడా యినుమిక్కిలిగా దూఱుతూన్నారు. “అట్టిపండితులలో నరయ నూటికి నొక్కరుండు కవీశ్వరుఁడుండునేమొ?” అని మాచిన్నతనంలో అనుకొనేవాళ్లం. యిప్పుడు పాండిత్యానికీ, కవిత్వానికీ సంబంధమే లేదని రుజువౌతూ వుండడంచేత జన్మాంతరవాసనచేత పుట్టిన ధార వొక్కటే రచనలకు మూలమని తేలింది. (“గారెలపిండివంట” పద్యం గీరతంలో చూ, "దారిన్‌జిక్కిన" అనే పద్యంకూడ చూ) మునుపు తనకుపుట్టినధారకుతోడుగా శాస్త్రాలోకన లోకాలోకనాదులువుంటే బాగుంటుందని వాట్లను సంపాదించడానికి యత్నించేవారు, అది కొంతశ్రమతో చేరినపని కనక యిప్పుడు ఆసామగ్రినే తగ్గించడం మంచిపనిగా వూహించి వున్నదాన్నికూడా తగ్గించుకుంటూ వున్నారు. యీరకంలో కొందఱు అనవసరంగా యేపూర్వమహాకవినో పుచ్చుకొని అతణ్ణి దూషించడానికి ఆరంభిస్తూన్నారు. దానిస్వరూపంయుది.

“మ. ఉదయం బస్తనగంబు సేతువు హిమవ్యూహంబునుం జుట్టిరా
      విదితంబైన మహిన్ మహాంధ్రకవితా విద్యాబలప్రౌఢి నీ
      కెదురేరీ . . . . . . . . . . ....................................... ."

అన్నాఁడుకదా రామలింగం. యిది నన్నయాదులను ధిక్కరించినట్లా కాదా! అంటూ తలాతోఁకాలేని వాదానికి వుపక్రమించి యెనిమిదో అఠ్ఠాన్ని యేకరు పెడుతున్నారు. రామలింగం యేశతాబ్దంవాఁడు, నన్నయ్య భట్టేకాలంవాఁడు అనేవిచారణ ఆయీవ్యక్తులకు స్ఫురించకుండావుంటుందా? ఆయీసందర్భం రామలింగకవికి సమకాలీనులకే చెల్లుతుందిగాని యెన్నఁడో చచ్చి స్వర్గ మలంకరించినవాళ్ల కేం సందర్భిస్తుంది?

"శా. ఈక్షోణి నినుఁబోలు సత్కవులు లే రీ నాటికాలమ్మునన్"
                                                               (శ్రీనాథుఁడు)

ఆ యీ మాట శ్రీనాథుఁడికి పూర్వమందుండే తిక్కన మొదలయినవారికిఁగాని, పరమందుండే పెద్దనాదులకుఁగాని యెట్లు సమన్వయిస్తుంది? వేదాంతదేశికులవారు "శిరస్సు నిహితం మయా పద మదక్షిణం లక్ష్యతామ్" అని ప్రతిజ్ఞచేశారు. యింతకన్న ఘోరమైన, పండితలోకానికి అవమాన కరమైన ప్రతిజ్ఞ అంటూ వుంటుందా? యీ దేశికులవారి ప్రతిజ్ఞనుగూర్చి వ్యాసాంతమందు కొంతవ్రాస్తాను. యిది యెన్నఁడో స్వర్గమో, మోక్షమో పొందిన శంకరాచార్యులకు సమన్వయిస్తుందని యేమాత్రం పరిశీలన వున్నా అనుకోవడం తటస్థిస్తుందా?