పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/632

ఈ పుట ఆమోదించబడ్డది

736

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


నారాయణకవివతంసుడు పద్యకావ్యంగా విరచించి కవిలోకానికి విందుచేశాడు. కాని సర్వే సర్వత్రమాత్రం ప్రచారం జంగం కథకే వుండిపోయింది. పెద్దపెద్ద సంస్కృతసమాసాలు వగయిరాలు దిట్టకవిగారి దిట్టతనాన్ని బోధిస్తూన్నాయేకాని, పాత్రౌచిత్యాన్ని పూర్తిగా దూరీకరించి వేశాయి. కాని అట్టి సమాసాలజోలికిపోక రచించిన భాగాలు చాలా హృద్యంగా వున్నాయి. -

"బెబ్బులిమీసమైన మైలివెట్టి తెమల్పగవచ్చుగాని ఆ
 నిబ్బరగండడైన ధరణీపతి రావు నృసింహుడేలు నా
 బొబ్బిలికోటపై జనగ బోల గిరీటికినైన గాదు మా
 అబ్బపదమ్ములాన నిజమాడెద హైదరుజంగు సాహెబూ”

ప్రస్తుత్తం కాదు గనక, యీ దిట్టకవితల్లజుని స్పృశించి విడుస్తూన్నాను గాని, ఆలాగే కాకపోతే యీయన్ని గూర్చి యెంతేనా వ్రాయవలసి వుంటుంది. యీ “దిట్టకవి" అనే గృహనామధేయం యీయనవంశంలో వున్నట్టున్నూ పిమ్మట యీయన అందులో జన్మించినట్టున్నూ గోచరిస్తూవుంది. అప్పటికి లేనిచో ఆయీ బిరుదం వంశానికి యీయన సంపాదించి అలంకరించినట్లు కవులు సంభావించడానికి యీయనరచన పూర్తిగా తోడుపడుతుంది. విషయం విషయాంతరంలోకి యే కొంచెమో దిగుతూ వుంది. మళ్లా చుక్కాని బిగబడతాను.

పద్యరూపకంగా గాని, గద్యరూపకంగా గాని (వైద్యజ్యోతిషాలవలె, లేదా, కోర్టు జడ్జిమెంట్లవలెగాక) హృద్యంగా వుండేటట్టు యేకొంచెం గొప్పరచన సాగించినా ఆ వ్యక్తికి రచయితల పంక్తిలో స్థానం వుంటుందనేది యిప్పటికి తేలిన పరమార్థం. అయితే, “అధ్యాత్మరామాయణం" యావత్తూ గద్యగాని పద్యంగాని కాక, కీర్తనమయం. గ్రాంథిక భాషగాని వ్యావహారికభాష గాదు. ఆయీ మహాకవికి రచయితలలో స్థానం లేనట్టేనా? అని ప్రశ్న వస్తూవుంది. దీనికి జవాబేమిటి? అంటే, వినండి : ఆయీ రామాయణానికి వచ్చిన దోషమల్లా ఒక్కతాళరాగ సమన్వితత్వమేనా? ఆ పద్ధతిని వాల్మీకి తన రచన శ్లోకరూపంగా సాగించినప్పటికీ శిష్యులు కుశలవులకు రాగతాళ (“కుశీలవౌ కుశలవనామధేయౌ. చూ.) యుక్తంగా ప్రచారం చేయడం నేర్పి, శ్రీ రామచంద్రమూర్తిని సంతోష పెట్టినట్లు ఆ రామాయణంలోనే వుంది గదా? రాగతాళ సంబంధం దీనికెంత బాధకమో దానికీ అంతే కనక “నచ శంకా, నచోత్తరమ్” “అహో! మూలచ్ఛేదీ తవ పాండిత్యప్రకర్ష" ప్రత్యుత, ఆయిదోషం వేదానిక్కూడా సంఘటిస్తుంది. సామవేదాన్ని యజ్ఞంలో ఋత్విక్కులు గానం చేస్తారు. “వేదానాం సామవేదో౽స్మి" గానానికి తలిదండ్రులుగా గౌరవింపబడే (“శ్రుతి ర్మాతా, లయః పితా") రాగతాళసంబంధంవల్ల