పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/623

ఈ పుట ఆమోదించబడ్డది

727



యేది కవిత్వం-2

ఏది కవిత్వం! అని ప్రశ్నిస్తే జవాబుచెప్పడంలో చాలా విప్రతి పత్తులు కనపడతాయి. యేమంటే? భిన్నరుచిర్హిలోకః కొందఱికి కొన్ని మఱికొందఱికి మఱికొన్నిన్నీ రుచిస్తాయి. కొందఱు యేదీ తెలియక లోకంలో యెవరిని మెచ్చుకొంటూ వుంటారో తాముకూడా వారికవిత్వానికే వోటు యిస్తారు. కనక పయివిధంగా ప్రశ్నించడంకన్న అనాలోచనపని వుండదనిన్నీ తోస్తుంది.నాకు; కవికర్ణరసాయనకవి (సంకుసాలకవి) “అవివో! కవితల్” అని తేలికగా అనేశాఁడు. అవంటే; యేవి? అనే ఆకాంక్షకుకూడా అతఁడే వ్యాఖ్యానించాఁడు. "లోకుల రసనలె (నాల్కలె) ఆకులుగా నుండునట్టి యవివో! కవితల్” అన్నాఁడు. ఆయీకవి తాటాకులమీఁద రచనలు సాగించే రోజులలో వాఁడు అని ఆయీ వాక్యమే చెపుతూవుంది. యేకవి కవిత్వం పదిమందికీ కంఠోపాఠంగా వస్తుందో, అదే కవిత్వంగాని తాటాకులలో మురుగుతూవుండే కవిత్వం కవిత్వమేకాదని ఆయీ కవితాత్పర్యం. అయితే యీకవి కవిత్వం ఆయీ లక్షణానికి లక్ష్యభూతంగా వుంటుందా? అనే ప్రశ్నకు అవకాశం కలుగుతూవుంది. కాని చెప్పడం సుళువుకాని, చెప్పినట్లు చేయడం యీ కవికే కాదు యే కవికీ పుస్తకాపేక్షే

అట్టిస్థితిలో యీతని కవిత్వం నాకు చాలాభాగం కంఠోపాఠంగా వచ్చును. కనక యీయన చెప్పినట్లు రచన చేశాఁడందామా? ఉహు. అది వీలుకాదు. లోకమంటే వొక్క చెళ్లపిళ్లేకాదుగదా? దీనికోసమని వోట్లకు బయలుదేఱితే యేమవుతుందో? అందుచేత యింకోకవి కవిత్వాన్ని తీసుకుందాం. (1) సుమతి శతకం, (2) వేమన శతకం, (3) కవిచోడప్ప శతకం యింకా వున్నాయి యీలాటివి. యిందు మొదటి రెండు పుస్తకాలు చిన్నప్పుడు (యిప్పుడుకాదు) బళ్లల్లో పఠింపచేయడం వుండేది. ఆ కారణంచేత అవి కంఠోపాఠంగా చాలామందికి వచ్చి వుండడం సంభవించిందంటే మనమాట బోటవుతుంది. మూడవ పుస్తకంలో బూతులుండడంచేత పామరులు వల్లించివుంటారు. కాబట్టి మఱొక కవిత్వం వెతుక్కోవాలి. యేకవి యీశాసనం చేశాడో ఆకవి కవిత్వం ప్రౌఢపాకంలో వుంటుంది. కొంచెం వుదాహరిస్తాను.

ఉ. పుట్టుగుఁజెట్లకున్ మొలవఁబోసిన విత్తులు శాంతి ముస్తకున్
    ముట్టియతోడి జీవములు మోహపు టుర్లకునున్ గుహూనిశల్
    ... ... .............................. ... కోరికలెవ్వరి నొంప కుండునే.