పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/612

ఈ పుట ఆమోదించబడ్డది

716

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


విమర్శించిన గ్రంథాలున్నాయి. “ద్విత్రాఏవకవయః ద్విత్రాణ్యేవకావ్యాని" అని నిర్మొగమాటంగాతేల్చేశారు విమర్శకులు. యింకొకవిశేషం. వెనకటికాలంలో యీకర్మం అంతగాఁగాని కొంతగాఁగాని వున్నట్టు లేదుగాని యీ 19వ శతాబ్దంలో అభిప్రాయాల కర్మం వొకటి వచ్చిపట్టుకుంది. ఆ అభిప్రాయాలలో “ఒక్కఁడేనియు నిజమగునూహ వ్రాయఁడు”గదా? ఆపద్ధతిని యీఅభిప్రాయాలెందుకు? “మూఢః పరప్రత్యయనేయబుద్ధిః" కనక వీట్లనుబట్టి మూఢులు తమ కవిత్వాన్ని ఆదరించి కొంటారనేనా? భవతు, యిది విషయాంతరం. యమకం చెవికియుంపుగా మృదంగాది శబ్దాలవలె హాయి నిచ్చినా, అది అంతతో ఆఁగిపోయేదేగాని వాసనారూపకంగా హృదయాన్ని ఆశ్రయించి వుండేదికాదు. అట్టి పద్యాలు కావ్యంలో ఆయాకవులు (కొందఱే అనుకోండి) యెందుకు సంఘటిస్తారంటే, కావ్యమంటే? వొక గ్రామంవంటి దనుకుందాం, ఆ గ్రామంలో చాతుర్వర్ణ్యమేకాక యింకా యింకా యింకా నిమ్నజాతులుకూడా వుంటారా వుండరా? ఆలాగే యమకప్రధానపద్యాలు కూడా వుండే వుంటాయి. కాని గ్రంథమంతా తన్మయంగానే ముగిస్తే మాత్రం నిమ్నజాతిమయమైన గ్రామంలాగే ఆకావ్యమున్నూ వుండవలసివస్తుంది. యమకమంత కాకపోయినా శ్లేషకూడా మితిమించివాడేపద్ధతిని మొగం మొత్తుతుం దనడానికి సంశయించవలసివుండదు.

తే.గీ. నీరజారాతి! నినుఁ దననెలవు గూల
      నేల సృజియించె విధి సృజియించుఁగాక
      యేల జైవాతృకునిఁ జేసె నేల తప్పుఁ
      బుడమిఁ "బాపేచిరాయు” వన్‌బెడఁగునుడుగు.

యీ మాదిరిగావుంటే "అన్యదాలోచనామృతమ్" తెగలోకి యేకొంచెమో చేరినా పూర్తిగా చేరదు. యింతకంటెకూడా సులభపాకం,

తే.గీ. విమలమధుర మనోహర వృత్తి వెలయు
      వారిఁ బొడఁగన బుధు లెంతదూరమైన

అనేది. యిందులో వారిశబ్దం మాత్రమే శ్లేషించి పద్యానికి యెంత సొగసివ్వాలో అంతాయిచ్చింది.

చ. వలఁ బడియున్న జక్కవ కవన్ బురణించుచు సన్నపైఁటలో
    పల వలిగుబ్బదోయి కనుపండువు సేయఁగ మోడ్పుచేతులౌ
    దలను ఘటించి మ్రొక్కిడి పదంపడి మెల్లన డాయఁబోయి తొ
    య్యలి విరిబంతి దోయిట నుపాయన మాయన కిచ్చి యిట్లనున్.