పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/609

ఈ పుట ఆమోదించబడ్డది

యేది కవిత్వం - 1

713

ఘనకబరీ = గొప్ప కొప్పున్నూ, స్తన = ఉరోజము లున్నూ, ఆకృతులు = ఆకారమున్నూ, (యేలావున్నాయంటే) కంధరమై = మేఘమై, ధరమై = పర్వతమై (జాత్యేకవచనం) రమైక్యమై రమా = లక్ష్మీదేవితో, ఐక్యమై = అభేదమును పొందినదై, క్రమాలంకారము. ఇలాగే తక్కిన చరణాలకున్నూ చూచుకోవాలి. యీమాదిరి కవిత్వం తెనాలిరామలింగం చెప్పినట్టు ప్రతీతి వుంది గాని అతనికి ప్రఖ్యాతి తెచ్చిన పాండురంగ మాహాత్మ్యంలో మాత్రం యిట్టి కవిత్వం మచ్చుకుకూడా కనపడదు. పాండురంగ మాహాత్మ్యంకాక రామలింగం పాండురంగ విజయం అంటూ వొకప్రబంధం రచించి వున్నాఁడనిన్నీ దానిలో యీలాటిపద్యాలెన్నో వున్నాయనిన్నీ విద్వత్పరంపర చెప్పుకోవడమేకాక ఆ గ్రంథం లోవే యీ పద్యాలంటూ ముక్తసరిగాకొన్ని పద్యాలు చదువుతూ వుండడం నా బాల్యం నాఁటికి విస్తరించి వుండేది. .

“తే.గీ. అతివకచనాభిజఘన దేహాననము త
        మీనదరసాలతారాజసానిరాక రణము. ... "

అనే పద్యంకూర్పు చూస్తే అందులో వున్న చిత్రవిచిత్రాలు సాక్షాత్తూ ఫాలాక్షుఁడిక్కూడా అత్యాశ్చర్యకరాలుగానే వుంటాయి కనకనే యితణ్ణి “రామలింగ" పదంతో లోకం వ్యవహరించవలసి వచ్చిందేమో అని నే ననుకుంటాను. యితని పాండురంగ మాహాత్మ్యం చూస్తే వైష్ణవమతస్థుఁడుగా కనపడతాఁడు. దానిగద్యలో రామకృష్ణుఁడుగా వున్నాఁడు. దీనిలో మొదటి అక్షరం "త" అనేది తీసివేయడం వగయిరా విశేషాలు వాఖ్యానించవలసివస్తే చాలా పెరుఁగుతుంది. దీనికికాకపోయినా యేదోవ్యాసంలో యెప్పుడో,

చ. అలఘనచంద్రబింబనిభ మై తనరారెను వక్త్ర మందులోఁ
    గలిగిన నామభేదముల కైవడి భాసిలెఁ గప్పుగొప్పు చె
    క్కులు రదనాంశుకమ్ములవి గుబ్బలకున్ సరిరాకపోయెఁజే
    తులు సరులయ్యె దానివలెఁ దోఁచెను బొంకపుటారు నాతికిన్

దీనికి కొంత వ్యాఖ్యానం చేసి ప్రచురించినట్లే జ్ఞాపకం. ఆ యీ పద్యాలలోదే వొక సీసపద్యం. "సీ. ద్విరదంబు నడతోడ" అనేది. యీ పద్యం యేచరణానికి ఆచరణమే సమన్వయిస్తుంది. మాముత్తాతగారు దీన్ని వరవడిగాఁ బెట్టుకొని రచించిన సీసపద్యం. సీ. శరదంబు వేణికి శాంతభావమునందె" అనే పద్యమో! యావత్తూ వొకపదంతోటే తిరుగుతుంది. చాలా అవయవాలవర్ణన దానిలో యిముడుతుంది. "అలరుచన్గుత్తు లీకొమ్మ కలరుఁజుమ్మ" అని తుట్టతుదకు కుచవర్ణనతో పద్యం ముగుస్తుంది. ప్రసక్తానుప్రసక్తంగా చాలా దూరం వచ్చాము. మా ముత్తాతగారు యమక కవిత్వం చెప్పడం తఱచుగా వుండేది.