పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/567

ఈ పుట ఆమోదించబడ్డది

“శుభస్యశీఘ్రమ్”

571

“మాదుమీదులు” మఱికొన్ని దుష్ప్రాసములు మొదలగుదోషముల కేమియు సమాధానములు చెప్పక యొక్క హ్రస్వముమీఁది బిందు నిర్బిందుప్రాసమునకు మాత్రమే యెక్కడనో యొకానొకచోట (శాంతి పర్వములోనోయేమో) ఉన్నట్లు స్థాననిర్ణయములేక తమకసి యంతయు వెళ్లఁగ్రక్కుచు 'శాస్త్రజ్ఞులు కాని విమర్శకు' లనియు బహుశః వారు తిక్కనగారి ప్రయోగమునైనఁ జూచియుండరనుకొందు ననియు వ్రాసిన వ్రాఁతయే సాక్ష్యమిచ్చుచున్నది." అంటూ వ్రాస్తారుకదా? సార్థబిందు నిరర్థబిందు ప్రాసవున్నపద్యంలో ప్రధానస్థలాన్ని (నగము ఎసఁగు) అనే పదాలతో చూపితినిగదా? పైఁగా శాంతిపర్వం అంటినికదా? కంద పద్యమని తెలిసికోవడానికి కూడా కొంత ఆధారం వుంది. ఏచరణానికి ఆచరణంగా, ఏపద్యానికి ఆపద్యంగా అచ్చువేసిన భారతాలు వున్నయీ రోజుల్లో ఆపద్యాన్ని వెతుక్కోవడంకూడ మీకు కష్టమే అయిందా? అదిన్నీకాక ఆవ్యాసంలో “నగములు. ఎసఁగు పూర్వస్థితిన" అన్నంతవఱకు కూడా మొట్టమొదట వుదాహరించి వుంటిని కదా? యింకా “ముంజేతికంకణాని కద్దం చూపించమంటారే" యిది మీకు యుక్తంగా తోఁచిందా? లక్షణగ్రంథాలలో ప్రయోగం యిచ్చి వూరుకుంటారుగాని యింత మాత్రమున్నూ స్థలం వగైరాలు సూచించరే? అయితే వకతప్పు నాది వుంది. శాస్త్రగ్రంథ సంప్రదాయం తెలియని మీకొఱకు వ్రాసే వ్యాసంలో శాస్త్రజ్ఞమర్యాదగా కలం నడపడం తప్పుకాకపోదు. కర్మం కాలి నాకు ఆలాటి మీతో వాదం వస్తే వచ్చిందికాక నేను-

చ. "గురుకులవాసమున్ జరిపి కూరిమి మాధుకరంబు వారముల్
     జరుపుచు, నమ్మగాని యొకసాధ్విని నమ్మ! యటంచు బాబటం
     చొరులను గొల్చి నేర్చితిమి యొండొకశాస్త్రము పండితుల్ సెబా
     సుర! యని మెచ్చఁ బద్యములు శ్లోకములున్ రచియింతు మొప్పుగన్"
                                                               (గుంటూరుసీమ - పూర్వరంగము)

ఆయీ పద్యంలో చెప్పినప్రకారం గురుశుశ్రూషచేసి నేర్చుకొన్న శాస్త్రమర్యాదను విడిచి యెలా వ్రాయడం తటస్థిస్తుంది.

(1) “కథంతర్హి హాపితః క్యాపి హేసుభ్రు” ఇతిభట్టిః

(2) "మణీవోష్ట్ర స్యేతితు ఇవార్థే వశబ్దో వాశబ్దోవా బోధ్య"

యీ మాదిరిగాఁ గదా? శాస్త్రగ్రంథాల్లో వుంటుంది. యిందులో వక ప్రయోగ విషయంలో "భట్టి" అనేనా అన్నాఁడు గాని రెండోదానిలో ఆమాత్రమున్నూ అనలేదుగదా! యీలాటి శాస్త్రమర్యాదలు మీకు చూపడం నాది మఱీతప్పిదంగా విజ్ఞలోకం భావిస్తుంది.