పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/555

ఈ పుట ఆమోదించబడ్డది

“శుభస్యశీఘ్రమ్”

559


పెద్దసమ్మానమేకాక గౌరవనీయులైన గవర్నరుగారు లోనగువారు వేయిన్నూటపదార్లు తలవనితలంపుగా సమ్మానించి వున్నారన్నది లోకప్రసిద్ధం కనక విస్తరించేది లేదు. నేనిప్పుడల్లా విమర్శకుఁడుగారివల్ల పొందదలఁచిన సమ్మానం. "కౌపీన సంరక్షణార్థ మయం పటాటోపః" గాని నాప్రస్తుతావస్థనుబట్టి అంతతోటే సంతృప్తి పడతానని వారికి మనవిచేసుకుంటూ వున్నాను. యిదివరలోకూడా మనవి చేసుకున్నాను. “మూఁడడుగుల్ మేరయ ద్రోయకిచ్చుటయె బ్రహ్మాండమ్ము నాపాలికిన్" అన్నమాదిరి ధోరణిలోకి దిగే కపటమేమేనా నామాటలలో వుందేమోనని విమర్శకుఁడుగారుగాని, వేఱొకరుగాని అనుమానపడనక్కఱలేదు. అట్టిబేరాలు నేనెక్కడా చేసివుండలేదు. యేమిస్తే అదే పుచ్చుకొని సంతోషించడమే నాప్రధాన ప్రకృతి. పోతరాజుగారి “క. వ్యాప్తింజెందక వగవక, ప్రాప్తంబగు లేశమేని పదివేలు" అనేపద్యం నాకు కంఠోపాఠం. నాకు (పొరబాటుచేతో యేమో? రూపాయనుకొనే అవుతుంది.) అర్ధణాకాసు (ఇప్పుడివి అమల్లోలేవు) యిచ్చి సమ్మానించినవారు కూడావున్నారు. అయితే శంకాసమాధానాలతో చేరిన వ్యాసంగనక దీనిమీcద వచ్చే పూర్వపక్షానికి జవాబు యిప్పుడే చెపుతున్నాను. నైజాం యిలాకా వనపర్తి సంస్థానంలో పదిరూపాయలు యిస్తే, “పదిరూపికలిచ్చినావుగా” అంటూ యెందుకు తగువులాడవలసివచ్చిందీ? అని శంకిస్తారేమో? బహుశః యీశంక యిదివఱలో విమర్శకుఁడుగారు వారి గ్రంథంలో యెక్కించే వుంటారేమో? అందులోవున్న శంకలన్నీ యీమాదిరివేకదా? ఆపుస్తకం ప్రస్తుతం నావద్ద లేకపోవటంచేత నిశ్చయించి వ్రాయలేకపోయాను. పనిలోపని యింకొకటి వ్రాస్తాను. విమర్శనపుస్తకాలు వందో? యేభైయో? నావద్దకు వారు పంపితే యెవరేనా ఉచితంగా కోరితే ఉచితంగా యిచ్చిన్నీ రు. 1–0–0 యిన్నీ ఇచ్చి పుచ్చుకుంటే ఆప్రకారంగా యిచ్చిన్నీ వసూలైన ఆసొమ్ము పువ్వులలోపెట్టి వారికి (మనియార్డరు ఖర్చుపోను) పంపించుకుంటాను. నాకు పుస్తకాలవర్తకం వుండడంచేత యిది వారికి అంగీకారమైతే యీసహాయంచేస్తాను. దానివ్యాప్తివల్ల నాయశస్సు అభివృద్ధి చెందుతుందనే పూర్ణవిశ్వాసంతోనే వారిని నేను యూవిధంగా అభ్యర్థించడం (క. నేరక కృతిచెప్పుట తననేరమి నపకీర్తి జగతినిల్పుట కాదే?) తరవాతమాట యేలాగవున్నప్పటికి ప్రస్తుతం వకపుస్తకం పంపవలసిందని ప్రార్థిస్తాను. యీవాదం యింతతో ముగిస్తే అక్కఱలేదుగాని యింకా యూరపుఖండ యుద్ధంలాగు సాఁగేయెడల అవసరమవుతుందేమో అని యీలా అభ్యర్థించడం. తొందరగా పోస్టుద్వారా పంపనక్కఱలేదు.

కొలఁది రోజుల్లో వారి గ్రామానికి నన్ను వెంటఁబెట్టుకొని వెళ్లనే వెడతారు కనుక అప్పుడు అడిగి తీసుకుంటేసరిపోతుందికదా! విమర్శకుఁడుగారు "హనుమత్పళ్లెం" మాదిరిని