పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/553

ఈ పుట ఆమోదించబడ్డది

“శుభస్యశీఘ్రమ్”

557


ఖర్చులు సుమారు నలభై యాభై రూపాయిలదాఁకా తగులుతాయేమో? అని వుజ్జాయింపుగా సూచించి వున్నాను. దాన్ని యిక్కడ తపిసీలుగా గుఱికి బారెఁడు హెచ్చుతగ్గులో వివరించడం ఆవశ్యకం కాకపోదు. యూ విద్యార్థి మూఁకంతా నాతో యెప్పుడూ రాదు. వృథాగా ఖర్చులు తగిల్చే దురుద్దేశంతో యీమూకని యిప్పుడున్నూ తీసుకు వచ్చేదిలేదు. నాభార్య సర్గస్థురాలయే సమయానికి సుమారు యేడేళ్ల శైశవావస్థలోవున్న కడసారికుఱ్ఱవాఁడు ప్రస్తుతం పదేళ్లవాఁడైనప్పటికి నేనెక్కడికివెడితే అక్కడికి– “తాడుతో దబ్బనం"గా తప్పఁడు. వాఁడికి సంరక్షణార్థమైతేయేమి, సహాధ్యాయిగా చదువకైతే ఏమి యింకో విద్యార్థి పెద్దటిక్కెట్టు వయస్సు వాఁడే వస్తాఁడు. యిక్కడికి టిక్కెట్టున్నఱగదా? నాసంరక్షణకంటూ వక పెద్దవిద్యార్థి కౌముది చదివేవాఁడు వుండాలి. కానీ బెజవాడలో వంతెన దిగడం యెక్కడం యీలాటి చిక్కువుండడంచేత యిప్పుడు కౌముది చదివే విద్యార్థి వయస్సు చేత పెద్దవాఁడేగాని నన్ను యెత్తుకొని "దండాడించడానికి" (దండాడించడం పెళ్లిలో నాగవల్లినాఁడు మావైపున జరుగుతుంది. పెళ్లికొడుకునీ, పెళ్లికూఁతుర్నీ చెఱివకరున్నూ యెత్తుకొని బుక్కాతో తెయితక్కలాడతారు. ఆవంతెనమెట్లల్లో యెత్తుకు నడిచేటప్పుడు ఆలాగే వుంటుందన్నమాట) తగ్గంత శక్తికలవాఁడు కాఁడు. అందుచేత అసలు ధూళిపూడినుండి పనిపడితే నన్నుయెత్తుకొని బెజవాడ బ్రిడ్జిమీఁద “దండాడింపు" చేయడానికి యెవరేనా రావలసి వుంటుంది సమర్థులు. యీవచ్చేవారు తిరిగి మాగ్రామం వచ్చేటప్పుడు ఆవంతెన గండం దాఁటేవఱకే కాని మాగ్రామం చేర్చేవఱకూ వుండ నక్కఱలేదు. అయితే అసలు బెజవాడలో దిగడంతో అవసర మేముంటుంది? ధూళిపూడికి (తణుకోయిమాచారంగా) తెనాలి దాఁకా యెకాయెకీనే ప్రయాణం చేయరాదా? అని ప్రశ్నిస్తారేమో? ఆయనే వుంటే మంగలాణ్ణి పిల్చి పెట్టునన్నట్టు ఆశక్తి లోపించిన అవస్థలోకి వచ్చి యిప్పటికి కప్పుడే పదేళ్లు దాఁటింది. యిప్పటిస్థితి చెప్పవలసివుండదు కదా? యిది ప్రాయోపవేశావస్థ, మదరాసు ప్రయాణం, పొన్నూరుప్రయాణం, నిన్నమొన్న నవరాత్రాలలో చేసిన తెనాలి ప్రయాణం, యివన్నీ బెజవాడలో మొదట మకాంచేసి తరవాత మళ్లా మఱునాఁడో? మూఁడోనాడో? రైలెక్కినవే మళ్లా తిరిగీ వచ్చేటప్పుడు బెజవాడలో దిగినవే. వారివారిని కనుక్కుంటే దీనియథార్థం తెలుస్తుంది. బ్రిడ్జిమీఁద "దండాడింపు" యిప్పటి కెప్పుడూ జరగలేదు. ఆసమయానికి భగవంతుఁడు యేలాగో కఱ్ఱసహాయంతో ("వృద్ధోయాతిగృత్వా దండం") ఆ గండందాటే శక్తిని యిస్తూవున్నాఁడు. ఆపక్షంలో యింకో టిక్కెట్టు వృథాగా యెందుకు తగల్చవలసి వుంటుందంటే? తీరా అవసరమైతే అప్పుడు మనకు అక్కడ మోసే మనిషి యెక్కడనుంచి సప్లయి అవుతాఁడో? ఆలోచించండి. పెట్టెలూ, బేడలూ మోసే రైలులైసెన్సు కూలీలు పనిపడితే మనిషిని సజీవుణ్ణి కూడా మోస్తారా? స్పెషలుగా ఆమోఁతక్కూడా వాళ్లు