పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/515

ఈ పుట ఆమోదించబడ్డది

నన్నయ్యభట్టు

519

విమర్శకుఁడుగారు నాతోపాటుగా వయోవృద్దులే అని వారిపీఠికలో వకవాక్యం చెపుతూవుంది. నన్నువారు పద్యాలలోనేకాక వచనంలోకూడా, "వేంకటశాస్త్రి" అనియేకవచనంగానే వాడుతూ వుంటారు. అది వారికి నాయందు వుండే నిరసనభావానికి స్ఫోరకమే అయినా దానివల్ల వారి విమర్శనగ్రంథతత్త్వం పూర్తిగా వెల్లడి కావడం సంభవించడంచేత నాయందలి ప్రేమగానే భావిస్తాను. లేకపోతే ఆయా విషయాలు అన్నీ కాకపోయినా కొన్నైనా నేను ఖండించి మచ్చు చూపవలసివచ్చేది. యిప్పడు ఆ పరిశ్రమ లేకుండా పోయిందని వేఱే వ్రాయవలసి వుండదు.

శా. కోపంబుల్ పనిసేయునే? ఒరుల కెగ్గుల్ చూపుచో-

ఒకటి మాత్రం నామీఁద పెద్దభారం దానంతట అదే వచ్చిపడింది. దూషించనివ్వండి. భూషించనివ్వండి. సుమారు నాల్గువందల పద్యాలకు యే మాత్రమో తక్కువగా తఱుచుచున్నను (నికృష్టంగానే కానివ్వండి) సంబోధిస్తూ గ్రంథకర్త విమర్శనవ్యాజంతో రచించినప్పుడు యీమూలంగా కృతి పతిత్వం అబ్బిన నేను ఆయన్ని సమ్మానించ వలసివుంటుందని వేఱే చెప్పనక్కఱలేదు. తిట్లకుకూడా సమ్మానమా? అని శంకిస్తారేమో? మాప్రాంతాన్నే నాబాల్యంలో జరిగిన యీ యితిహాసాన్ని వినండి. తహస్సీల్దారీ వుద్యోగాన్నో డిప్యూటీకలెక్టరీ వుద్యోగాన్నో చేస్తూవున్న వొక బ్రాహ్మణ గృహస్థు తనకూతురివివాహంలో సంతర్పణసమయంలో నేతిజారీ పుచ్చుకొని నేయి వడ్డిస్తూ వుండఁగా వొకానొక బలశాలి బ్రాహ్మఁడు- "నీ అబ్బ సొమ్మేమేనా ఖర్చుపెడుతున్నావా? బాగా సమృద్ధిగా వడ్డించవేమి" అని యేమేమో అంటూ వొకచెంపకాయ కొట్టినట్టున్నూ, దానితో దిమ్మతిరిగి ఆయన కొంత సొమ్మసిల్లి ఆజారీ అక్కడ వదిలిపెట్టి యింట్లోకి వెళ్లి - ఆ బ్రాహ్మణ్ణి భోజనమైన తరువాత నావద్దకి తీసుకురావలసిందని ఆర్డరిచ్చాడనిన్నీఆలా ఆర్డరివ్వడంతోటట్టే అందఱున్నూ యేదో శిక్ష విధిస్తారని అనుకుంటూ వుండఁగా, యేచేతితో ఆయన తన చెంపఁమీద కొట్టివున్నాఁడో ఆచేతికి వక మంచిబంగారు మురుగు బహుమతీ యిచ్చి ఆదరించి పంపేటప్పటికి అందఱూ ఆశ్చర్యపడ్డారనిన్నీ చెప్పకోఁగా విన్నాను. ఆబ్రాహ్మఁడు ఆయన యెవరో లేశమూ యెఱఁగఁడు పాపం. భవతు. ఆకాలపు వాళ్ల ఉదారతలు అలావుండేవి. రాయన భాస్కరుఁడు మొదలైనవారు ఆలాటివుదారులే. యిపుడు నాకు ఆలాటి అవకాశమే తటస్థించింది. నేను సామాన్యగృహస్టుడు గాని జమీందారుణ్ణికాను. దానంతట తటస్థించిన అవకాశాన్ని దాఁటఁబెట్టకూడదు. గ్రంథకర్తకు నన్ను తిట్టడమే వుద్దేశమైనా గ్రంథాన్ని కృతియిచ్చి కృతిపతిని చేసినట్లు తుదకు పరిణమించింది. కవిత్వం బాగా సాఫుగా వుంది. అందుచేత నాశక్తికొలఁదిగా- "చంద్రుఁడికొక నూలుపోగు" అన్నట్టు