పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/509

ఈ పుట ఆమోదించబడ్డది

నన్నయ్యభట్టు

513


కూడా యీయన వ్రాయ సాహసింతురు. యీసాహసానికేంగాని పయిపద్యధోరణిచూడండి, నన్నయ్యపేరు వినఁబడేటప్పటికి విమర్శకుఁడుగారి కెంతఅగ్రహమోఁ యేమి కాలకర్మ దోషమో? యీమధ్య కొన్నివ్రాఁత లీలాటివే చదవటం తటస్థిస్తూవుంది. కొందఱు-

“నన్నయ్యగారి ద్రౌపది” అనిన్నీ “తిక్కన్నగారి ద్రౌపది” అనిన్నీ విడఁదీసి వారివారి వాగ్వైశద్యాలు చూపడం మొదలుపెట్టడం చూచి వెగటుగాఁదోఁచి కాఁబోలు మా సతీర్థులు శ్రీకాశీభొట్ల సుబ్బయ్య శాస్త్రులుగారు గాఢంగా మందలించి వున్నారు. అది కొంతవఱకు అభినందనీయంగానే వుంది గాని ఆ సందర్భంలో తిక్కన్నగారిరచనకు ప్రత్యక్షరానికిన్నీ బొత్తిగా అనౌచిత్యాన్ని ఆపాదించడమనేది కొంతశోచ్యంగా నాకు తోఁచింది. అట్టిసందర్భంలో నీవెందుకు సుబ్బయ్యశాస్త్రుల్లుగారి పూర్వపక్షాలను ఖండించకూరుకున్నావని యెవరేనా నన్ను ప్రశ్నిస్తారనుకుంటాను. సుబ్బయ్యశాస్త్రులవారు మంచి శాస్త్రజన్యజ్ఞానంతో మిళితమైన యుక్తినైపుణ్యం కలవారుగా వుండడంచేత ఆయన ఆక్షేపణలు ఖండించడానికి పూనుకుంటే సుఖసుఖాల తేలేటట్టు కనపడక అనారోగ్యంచేత బొత్తిగా అసమర్థతా స్థితిలో వున్న నేను దానిజోలికి పోలేదు. నిజానికి సుబ్బయ్యశాస్త్రుల్లుగారు యెవరో నన్నయ్యనుగూర్చి అనుచితపువ్రాఁత వ్రాయడంచేత వారికి వాగ్బంధం కలిగించడానికే అట్టిపూనిక పూనివున్నారుగాని, తిక్కన్నగారియందు శాఖాద్వేషం వుండికాదని నేననుకున్నాను. అదేమాదిరిగా విమర్శించవలసివస్తే నన్నయ్యతిక్కన్నగార్ల లెక్కయేమి? వ్యాసవాల్మీకు లాగుతారా? కాళిదాస భవభూతు లాగుతారా? కాcబట్టి అది విమర్శనమే కాదు. అందుచేత సుబ్బయ్యశాస్త్రుల్లుగారు ఆపనికి పూనుకోవడం యింకా విచారణీయమేను

“మయి జల్పతి కల్పనాధినాథే రఘునాథే మనుతాం తదన్యదైవ"

అన్నట్టు సమర్ధులైనవారు పూనితే మంచి చెడ్డగానూ, చెడ్డ మంచిగానూ కావడానికి యేమాత్రమూ అభ్యంతరం వుండదు. "జ్ఞానలవదుర్విదగ్ధుల" వ్రాఁతలు తాటాకుదళ్లవలె క్షణంలో యెగిరిపోతాయి. కాళిదాసుగారు-

“అధరస్య మధురిమాణం కుచకాఠిన్యం దృశోశ్చ తైక్ష్ణ్యంచ"

అంటూ వకశ్లోకం లోకోత్తరమయినది చెప్పివున్నారు. సహృదయత్వం వదలి దీన్ని నేను బగ్గంపాడుగా విమర్శించి పాడు చేయడం మొదలుపెడితే యెవరుగాని సమర్ధించనే లేరని సప్రతిజ్ఞంగా చెప్పవలసివచ్చి చెపుతూవున్నందుకు లజ్జిస్తూవున్నాను. వూరికే మచ్చుకు వకశ్లోకంయొత్తిచూపివున్నాను గాని యేకవిదేనా సరే, యేశ్లోకమేనా సరే సహృదయత్వాన్ని