పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/508

ఈ పుట ఆమోదించబడ్డది

512

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


వున్నారు. ఇక్కడ నాకు కర్తవ్యమేమిటి? యేమీలేదు. శిరసావహించి వూరుకోవడమే. ఆ పద్యం తరవాయి పద్యంకూడా చూడండి! ప్రాజ్ఞులారా!

క. దయచేఁ దెనిఁగింపక న
    న్నయభట్టిది మాకు నిచ్చినాఁడనుకన్నన్
    బ్రియమెక్కువ గనఁబడు ని
    శ్చయమగు మామీఁదికరుణఁ జచ్చెనటన్నన్.

అబ్బా! విమర్శకుఁడుగారి ఆగ్రహానికి పట్టపగ్గాలే కన్పడడంలేదు. యెందుకో! నన్నయ్యగారిమీఁద యీ అకారణకోపం. మమ్మల్ని విమర్శకుఁడుగారు దిద్దుకొమ్మన్నట్టు దిద్దుకోవలసివస్తే నన్నయ్యభట్టును మాత్రమే "దయచేత చచ్చినట్టు" వుటంకిస్తే యేలా సమన్వయిస్తుంది. తిక్కన్న, యెఱ్ఱన్న, పోతన్న, సోమన్న, ఇంకా యెందఱో ప్రాచీన కవులు మాయందు దయచేత చచ్చివున్నారని వ్రాయవలసివస్తుందిగదా? అప్పుడు ఆ విషయం వైదికశాఖవాడైన నన్నయ్యకే ఘటింపక విమర్శకుఁడుగారు ప్రేమించే వారికికూడా తగిలితే అది వారి ఉపదేశానుసారం మేము చేసిన అపరాధమైనా మా మీఁద మఱింత కోపం హెచ్చి మమ్మల్ని యింకా నిందిస్తారేమో అసలు పద్యంలోవున్న- “నన్నయభట్టాది కవిజనంబులు" అనే పదంలో యెంత పరిశీలించినా యేవిధమైన దుర్ధ్వనిన్నీ లేకపోయినా విమర్శకుఁడుగారు నన్నయభట్టుకు ఆంధ్రకవీశ్వరులలో ప్రప్రథమత్వం యెందుకురావాలి అనేవుక్కురోషంతో యీ మందలింపు వుపక్రమించినట్టు పసులకాపరులకుకూడా గోచరించే విషయంలో యింతకన్న పెంచి వ్రాయడం అనవసరమని విరమిస్తూన్నాను. యిది వొకచిత్రమైనకాలం. యీ కాలంలో విమర్శనాలుమాత్రమే కాదు. యింకా యెన్నో సందర్భాలు యీలాటివే కనపడతాయి. "కాలాయనమః కలవికరణాయనమః" నన్నయ్యభట్టుకంటె పూర్వం తెలుఁగుకవిత్వం చెప్పేవారు లేకపోరుగాని యీలాటి సలక్షణకవిత్వం చెప్పేవారు లేకపోవడంచేత యితనికి ప్రప్రథమత్వభాగ్యం తటస్థించిందని చెప్పవలసి వస్తుంది. పైఁగా విమర్శకుఁడుగారు నన్నయ్యకు యింకోదోషాన్ని ఆపాదించివున్నారు

తే.గీ. పరుఁడు తోడయి నిర్వహింపంగ భార
       తము తెనింగింపఁ గలుగుట తానె చెప్పె
       నట్టినన్నయ్యభ ట్టెట్టు లర్హుఁడయ్యె
       హెచ్చు గలిగించి నీయిచ్చు మెచ్చు గొనఁగ.

నారాయణభట్టు సహాయమంటూ లేకపోతే నన్నయ్యభట్టు భారతాన్ని ఆంద్రీకరించనేలేఁడని వీరి తాత్పర్యమనుకోవాలి. భారతం నన్నయ్యగారి కన్వయించదని