పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/504

ఈ పుట ఆమోదించబడ్డది

508

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


నిర్దుష్టమే అయినా తిక్కనగారి నాటికి దుష్టమనేవాదం బయలుదేరివున్నట్టయితే తిక్కన్నగారు వదులుకోవలసివుండేది. కాని ఆలా వదులుకొన్నట్టులేదు. యీసిద్ధాంతము శేఖరకారకునిదవడం చేత తిక్కన్నగారు శేఖరకారకునికంటె (యీ పూర్వాపరవిచారం బొత్తిగా తెలియక ఒకరు కాశికావృత్తికంటె కౌముదే పూర్వమెందుకు కాకూడదంటూ వ్రాశారు) పూర్వులు కావడంచేత ఆయనికి గోచరించవలసిన ఆవశ్యకత లేదనుకున్నా అనుకోవచ్చును. కాని తిక్కన్నగారు వొకచోట అక్షోహిణీశబ్దాన్ని యతిస్థానంలో ప్రయోగించి వున్నారు. “అక్షాదూహిన్యాం" అనే వార్తికంవల్ల అక్షౌహిణీశబ్దం ఔకార ఘటితమే కాని ఓకారఘటితంగా కూడా వుండడానికి అవకాశంలేదు. కాని ఓకారఘటితంకూడా వుండవచ్చునని తత్త్వబోధినిలో సమర్ధనం కనపడుతుంది. తత్త్వబోధినిగాని, కౌముదిగాని తిక్కన్నగారి నాఁటికి పుట్టినగ్రంథాలుకావు. అయితే ఆయన కీవిషయం యెట్లు గోచరించిందంటే వారుచదివిన యితర గ్రంథంలో యెక్కడో వుందని సమర్ధనం చెప్పుకోవలసి వుంటుంది. విషయం విషయాంతరంలోకి డేఁకుతూ వుంది. మనకు ప్రధానం నన్నయ్యభట్టు ఆంధ్రానికి ప్రప్రథమలాక్షణిక కవి అవడంచేత అతనిప్రయోగ మెట్టిదైనా అది తిక్కనాదిమహాకవులకు ఆదరణీయం కావలసివచ్చిందన్నదే. యేకొందఱు చేదస్తులో తప్ప తక్కినమహా కవులందఱూ వక్కనన్నయ్యనేకాక కవిత్రయాన్ని ప్రథమాచార్యులుగా సమ్మానించి వున్నట్టు లక్షణగ్రంథాల వల్ల స్పష్టపడుతుంది. మేము యీతుదిమతాన్ని అవలంబించడమే కాకుండా యింకా ప్రసిద్దులైన పోతనాది మహాకవులనుకూడా ప్రయోగాలవిషయంలో ఆదర్శప్రాయులుగా పెట్టుకొని కవిత్వాన్ని సాగిస్తూవచ్చాము. యీ అంశాన్ని"సీ. నన్నయకవి పెట్టినాఁడుకదా? తిక్కనాది కవీంద్రుల కాదిభిక్ష.. ...వీరలును వీరిమార్గమ్ము గోరి యాంధ్ర కృతుల నొనరించి బహుబహూకృతుల నలరు వారలును మాకుఁ బూజ్యులు"- అనే మాశ్రవణానందపద్యం వ్యాఖ్యానిస్తూనే వుంది. తిక్కన్నగారు, అర్థబిందు రహితమైన నగము అనేదానికి సార్థబిందుకమైన ఎసఁగు అనేదాన్నిప్రాసలో నిల్పడాన్ని బట్టియ్యేవే మేము అట్టిప్రాసమును వాడియుంటిమి. యిది యేమో మేము స్వతంత్రించి చేసినసాహసమని వొకానొకరు యీ మధ్య గుంటూరుడిస్ట్రిక్టులోని శాస్త్రజ్ఞులుకాని విమర్శకులు వ్రాసి వున్నారు. బహుశః వారు తిక్కన్నగారి ప్రయోగాన్నేనా చూచివుండ రనుకుంటాను. భారతంలోవున్న విశేషాలు యెందఱెంత శోధించినా యింకా మిగులుతూనే వుంటాయి. ఆ కారణంచేతనే-

"సముద్రమున కెవ్వఁడు పారము నిర్ణయించెడిన్" అని దేవీభాగవతంలో వ్రాయవలసి వచ్చింది. దీన్ని గుఱించి గుంటూరు డి|| విమర్శకులు పూర్వులు భారతమహా సముద్రాన్నుంచి ముత్యాలూ, రత్నాలూతీస్తే వీరునత్తగుల్లలు కాఁబోలు తీశారంటూవ్రాశారు.