పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/476

ఈ పుట ఆమోదించబడ్డది

480



క్షంతవ్యుఁడుగారు

క్రమంగా “విమర్శకబుధుఁడు" గారు "క్షంతవ్యుఁడు” గారు కిందికి వచ్చినందుకు కొంత సంతోషించ వలసివుందిగాని యింకా ఆమాట వ్రాయడంలో కొంత వెనకా ముందూ తొక్కుళ్లాడుతూవుందిగాని కలంచురుగ్గా నడిచినట్లుమాత్రం ఆ ఘట్టంలో మాటలు వక్కాణించడంలేదు. యింకా పింగళి సూరన్నగారిని తిరుపతి వేంకటకవులు ప్రభావతీప్రద్యుమ్న నాటకంలో వెక్కిరించారన్నమాట సమర్థనీయం అవుతుందనే ఆశ "క్షంతవ్యుఁడు” గారికి వుందే అనుకుందామా? శివశివా! సాహిత్యశిరోమణి ప్యాసై ఆ మాత్రం జ్ఞానంకూడా వుండకుండా వుంటుందా? తి. వెం. కవులు శుచిముఖి పాత్రద్వారా ప్రకటించిన ప్రజ్ఞలవల్ల "బుధుఁడు" గారు ఇటీవల "కొబ్బరిచెట్టూ-దూడగడ్డీ" సామెతగా అపలపించిన వ్రాఁత సమర్ధింపఁబడదని పూర్తిగా తెలుసుకున్నారు. దానిమీఁదే యీ “క్షంతవ్య" పదం బయటికి వచ్చింది. యిప్పుడున్న అపేక్షేమిటంటే? దేనిలోనోవకదానిలో నెగ్గకపోతామా? యేమాత్రం నెగ్గినా ఆత్మపక్షీయులు కొంతకాకపోతే కొంతేనా సంతోషిస్తారుగదా అని వుంది పాపం! అయితే యీ "పిచ్చిసోమయాజులిని" యీ “క్షంతవ్యుఁడు” గారు బాగా యెఱుఁగరు. ముసలాఁడుగదా అనుకున్నారు. సభలో పిం. సూ. గారిని తి. వేం. కవులు వెక్కిరించడాన్ని సమర్థించడం కృష్ణలో సూచించేటప్పటికి కొంతమట్టుకు పశ్చాత్తాపం కలిగింది. మళ్లా కొన్ని శంకలు పుట్టుకువచ్చాయి. పుట్టుకురాక అంతతో శాంతిస్తాయా? “మనోరథా”. ఆశంకలలో, “వ్యాకరణ విశేషాలు నాటకాలలో వాడవచ్చునా!” అన్నదానికి లఘువుగా సమాధానం కృష్ణలో యివ్వఁబడ్డదే. అది అంతతో నివర్తించివుంటుందనుకుంటాను. నివర్తిస్తే మాత్రం పిడివాదం తప్పుతుందా? తప్పదు. యిఁక శుచిముఖిని పక్షిగానే నటింపఁజేయడం యెట్లాగ? అంటూ వక పెద్ద శంక. ఆ శంకకి మళ్లా బాధ కలుగుతుందేమోనని, “ఆంజనేయులు, గరుత్మంతుఁడు" అంటూ యిద్దఱిని వుచ్చరించి వీరికి తప్ప యితరులకు అట్టిఅవకాశం లేదనడం వకటి. యీ వినాయిం పెక్కడ వుందో కదా! పాపం కొంచెం యెదటిదెబ్బ కాసుకునే వుపాయం వుంది. కాని హృదయం మాత్రం మంచిస్థితిలో లేదు. వుంటే "చక్కని రాజమార్గం" లోనే ప్రవర్తించి సందేహనివృత్తి చేసుకోవచ్చునుగదా! అసందర్భంగా- "వెక్కిరింపఁబోయి” అంటూ తారతమ్యజ్ఞానవిరహితంగా వుపక్రమించడం యెందుకు వస్తుంది? యీ