పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/461

ఈ పుట ఆమోదించబడ్డది

465


వెక్కిరింపఁబోయి బోల్తాపడుటయే-2

ఇదివఱలో రెండువ్యాసములు దీనింగూర్చి కొంత సంగ్రహముగా వ్రాసియుంటిని. ఇంకొక శంకనుగూర్చి యిపుడు వ్రాయుచున్నాను. ఆయన వాక్యమ్ములనే వ్రాసినచో గ్రంథము పెరుఁగును. కావున నా వాక్యతాత్పర్యమిట నుదాహరించి పిమ్మట నేను వ్రాయఁదలఁచినది వ్రాయుదును. ఆయనశంకయిది “ఒక్కశుచిముఖిపాత్రలో తి. వేం. కవులలో నెవరో యొక్కరే ప్రతిఫలింప వీలగును గాని యిరువురును నెట్లు ప్రతిఫలింప వీలగును" అని. శంకించువారి ముఖ్యతాత్పర్యమిది మాత్రమే యైనను దీనిని బలపఱుపఁదగిన వాక్యములు చాల నున్నవి. ప్రభావతీప్రద్యుమ్నము తి. శా. గా రొకరే రచింపమొదలిడినారు గాన ప్రథమాంకము నందలి ప్రతిఫలనము యుక్తమేకాని, ద్వితీయాంకమునందలి వేం. శా. గారి ప్రతిఫలనము మాత్రము యుక్తముకాదని తేల్చినట్లగుపట్టెడిని. వ్యంగ్యముగాఁగన్పట్టు విషయముగదా ఇది? అట్టి సందర్భమున నిట్టి స్తనశల్యపరీక్షతో నావశ్యకతయే యుండదు. మాటవరుసకు, పోతన్నగారికి నేపాత్రము నందు భాగవతమున ప్రతిఫలనము కలదో విచారించిన, విశేషించి వామనునియందని తేలును. అది సంస్కృతమున కనువాదమని త్రోసివేయరాదు. ఆ ఘట్టమున పోతన్నగారి స్వకపోలకల్పితము చాలనున్నది. అగుచో నాయా లక్షణములన్నియుఁ బట్టింపవలె నన్నఁ బట్టు నా? “ఒంటివాఁడఁ జుట్ట మొు కఁడులేఁడు" అని వామనుఁడనియె. పెండ్లమును, బిడ్డలును గల పోతన్నగారియెడల నిదిసమన్వయించునా? కావున వలనైనంతవఱకును సమన్వయమును గమనింపవలెను. ఇరువురొక పాత్రమున ప్రతిఫలించుట యొకటేయద్దమున నేకకాలమునఁగాని, లేక పర్యాయముగాఁగాని పలువురు ప్రతిబింబించుటవంటిది యనుకొన్నచో సుళువుగాఁ దేలుచున్నను విమర్శకులు మిక్కిలి పెంచి కోలాహల మొనర్చిరి. ఇయ్యెడ విమర్శకుఁడుగా రొనర్చికొన్నశంకా సమాధానములు, “తుమ్మికొని దీర్గాయుష్య" మనుకొనుతరగతిలోనివి. విమర్శకుఁడు వసుదేవుని యాగమున నవధాన మొనర్చిన దొక్కశుచిముఖియే యనుకొని కొంత చెత్త పెంచెను. తోవాసముగా వేఱొకహంసమున్నది. నన్ను-నాకు-నేను అను నేకవచనములు బాధింపవు. అపుడు మాటలాడుచున్న దెవరు? పరికింపుఁడు. ఒక్క శుచిముఖిపాత్రముమాత్రమే కావున, తత్తదేకవచన ప్రయోగములు లేశమును బాధింపవు.