పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/433

ఈ పుట ఆమోదించబడ్డది

కవికన్న విమర్శకుcడికి జాగరూకత ఎక్కువగా ఉండాలి

437


బాగాతోచడంలేదు. భవభూతి వకసందర్భంలో యేమీచెప్పడానికి పాలుపోకే కాబోలు, ఆత్మైక గోచరమైన విషయం అనడానికి బదులు “జ్వరోవా మూర్చావా కిము విషవిసర్పః కిముమదః" అని వూరుకున్నాడు. అలాగే కవిత్వాన్ని దేనితో పోల్చాలో నాకు నిష్కర్షగా తేలడంలేదు. -

ప్రయత్నపూర్వకంగా వ్రాసేకవిత్వాన్ని గూర్చి నేను వ్రాయలేను గాని, దానంతటది తోచేదాన్ని గూర్చి కొంచెం వ్రాస్తాను. అది తోచినప్పుడు దాన్ని కాగితంమీదెక్కించేదాకా చాలాబాధగా వుంటుంది. యీవిషయాన్ని గుఱించి నేచదివి చూచినంతలో యేకవీ నిర్వచనంచేసినట్టులేదు గాని కుట్టికవి కొంచెం సూచించాడు. "అర్ధాశ్శబ్దచయా స్సదాహ మహమిత్య గ్రేస్ఫురంతి" అన్నాడు. అని వూరుకొన్నాడా, మళ్లా యిల్లాఅన్నాడు : “స్వికుర్యాంకమివత్యజామికమివ శ్రీమన్ లులాయ ప్రభో" అంటేయేమిటంటే ఆగ్రంథకర్తకు దున్నపోతుమీద కవిత్వంచెప్పవలసిన అవసరం కలిగింది. ఆపట్టాన్ని మొదలెట్టేడు, ఆ కల్పనలకు మితే కనబడకపోయింది కాబోలును, దానిమీద పైసందర్భాన్ని ఆవాక్యాలతో ప్రకటించాడు. వూరికే తండోపతండాలుగా, సముద్రపుతరంగాలుగా, అర్థాలూ, శబ్దాలువచ్చి మెదడులో నాట్యంచేస్తూండేటప్పటికి వాట్లల్లో దేన్ని స్వీకరించేది, దేన్ని వదలిపెట్టేది అంటాడు పాపం ఆ కుట్టికవి. ఆ సమయంలో ఆ మహాకవి కేలావుందో యెవరికి తెలుస్తుంది! అతనికే తెలియాలి.

అందుచేతనేకాబోలు మాముత్తాత నరసన్నగారు “కవితాచమత్కార గౌరవంబు మనసెఱుంగునుగాక నెవ్వనితరంబు" అన్నారు. అవును, వక బంగారుగనో, వజ్రాలగనో వక పేదకు దొరికిందనుకోండి. ఆపదార్థాలని త్వరలో యింటికి అసహాయంగా తెచ్చుకోవాలంటే యేలావుంటుందో ఆలోచించండి. ప్రస్తుత శబ్దార్థవిషయంకూడా ఆలాంటిదే అనుకుంటాను. కుట్టికవిగారి అనుభవానికిన్నీ నాఅనుభవానికిన్నీ పోలికవున్నట్టు తోచడం చేత ఆయన వాక్యాలుదాహరించి యింతవ్యాఖ్యానంచేశాను. అందఱిదిన్నీ యిట్లే ఉంటుందని నేను నిశ్చయింపజాలను. నా అనుభవములో కవిత్వం అనేది తోచకనేపోవాలి గాని తోచినతర్వాత దాన్ని కాగితంమీద కెక్కించకపోతే అది వ్యాధినికూడా కలిగించి శరీరానికి అపాటవం తెస్తుందనే నమ్మకం. అందుచేతనే దీన్ని నేను "ఫారిన్‌మేటరు"గా రూపిస్తూ వచ్చాను. బాధిస్తూంటుంది తోచినకవిత్వాన్ని వ్రాయకపోతే అన్నమాటమీద జ్ఞాపకంవచ్చింది. వక జ్యోతిష్యుడున్నాడు మా ప్రాంతంలో, ఆయన జాతకభావంలో కొంత ప్రవేశం కలవాడు. ఆయనకి జాతకం చేతికిస్తే చూచి యేవేనా అరిష్టాలు కనబడితే వాట్లకి శాంతిచేసుకొమ్మని చెప్పడం కలదు. చెప్పినప్రకారం అవతలివాళ్లు శాంతి చేసుకుంటే