పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/412

ఈ పుట ఆమోదించబడ్డది

416

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


అవకాశంలేదు. యేమంటే కొన్ని అకృత్యాలు అవలంబించి తద్వారాగా పామరులు పొందుతూ వున్న తాత్కాలిక లాభాలు చూచి కళ్లుకుట్టి క్రమంగా ఆలాటి వ్యాపారాలలోకి పండితులుకూడా దిగుతూ వున్నట్టు యిప్పటి ప్రపంచకం సాక్ష్యమిస్తూనే వుంది గనక విస్తరించవలసింది లేదు. యిది ఆలాటిది కాకపోయినా అంటే? ఆ బ్రాహ్మణఛండాల పర్యంతమూ జంకవలసిందే. అయినాక్రమంగా జ్ఞానులలోకూడా వ్యాపించడానిక్కారణం యీ నీలాపనిందలకు యేవిధమైన అపకారమున్నూ దైవమూలకంగా వచ్చినట్టు లేకపోవడమే. దానితోటి "అసత్యకల్పన" మంటే సర్వసాధారణమైనట్టు కనపడుతుంది. యీ కల్పనకూడా వొకటే విధంగా వుండదు. కొందఱు లాభాపేక్షతో దీన్ని ఆశ్రయిస్తారు. కొందఱు యే ప్రయోజనమూ లేకుండానే దీనిలో వ్యాపకం చేస్తారు. యెవరెందుకు దీనిలోదిగినా, యెప్పుడో వొకప్పుడు యిది తగినంత ప్రాయశ్చిత్తముచేసి తీరుతుందిగాని వూరికేపోదు. కాస్త నలుగురిలో తలెత్తుకు తిరిగే యే వ్యక్తిన్నీ యీ నీలాపనిందా కారకత్వంలో పాల్గొనకూడదు. పాల్గొనడమే అనర్థదాయకమైనప్పుడు యావత్తు యాజమాన్యమూ వహించవలసివస్తే, యిక చెప్పేదేమిటి? యీ నీలాపనిందలకు గుఱియైనవ్యక్తులు చాలామంది వుంటారు గాని యీ కాలంలో తి|| వెం|| కవులు గుఱిఅయినంత యెవ్వరూ అయివుండరు. గీరతంలోనున్నూ, గుంటూరిసీమలోనున్నూ విశేషించి వుంటుంది. ఆ గ్రంథధ్వయం లోనున్నూ యీ నీలాపనిందలకు ముఖ్యంగా పరిశీలించతగ్గది గుంటూరిసీమ. గీరతంలో

ఉ. "కట్టుచునున్నవారు గృహకాండము నారకమందు" అనే పద్యాలు ప్రచురించిన తరవాతేనా అపవాదకులు భయపడి వెనక్కుతగ్గినట్టు కనపడుతుందిగాని, గుంటూరి సీమవిషయంలో తుట్టతుదదాకా వొకటే పోకడ; అయితే ఆ సీమలో పలువురు యోగ్యులు వుండి వెంటనే యథార్థాన్ని ప్రచురించి సహాయం చేయడంవల్ల కొన్నాళ్లకేనా ఆరొంపిలో నుండి బయట బడగలిగాం గాని లేకపోతే యేమయేదో? చెప్పజాలము. ఆయా వ్యక్తులందఱినీ కాదుగాని, అందులో వొకటి రెండు వ్యక్తులు జ్ఞాపకంవస్తే యిప్పుడుకూడా వొళ్లు జలదరిస్తుంది. యెప్పుడో ఆ కాలం అంతరించి పోయిందంటే "తుదకబ్బెరా తురకభాష" అన్నట్టు మళ్లాయిప్పుడు ఆలాటివారు బయలుదేరి యేవెఱ్ఱిమొఱ్ఱి అసత్యాలో వ్రాయడంచేత యేదో కొంత ‘పిల్లిమీదా యెలకమీదా" పెట్టి నాల్గు మాటలు వ్రాయడం; యింతే స్వస్తి-


★ ★ ★