పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/409

ఈ పుట ఆమోదించబడ్డది

నీలాపనిందలు

413


అందులో సంగతులు (కొన్నే అనుకుందాం) సర్వాబద్ధం అని కొందఱు వ్రాయ సాహసించినవారు లేరా? ఆలాగే ఆ రోజులలోనున్నూ కొన్ని విషయములనుగూర్చి అపవదించేవారుకొందఱు వుంటే వుండవచ్చుననిన్నీ క్రమంగా వారి అపవాదులు విని నమ్మిన ఆకాలానికి కొంచెం యిటీవలి కవులు గ్రంథంలో చేర్చి వుందురనిన్నీ నాకు తోస్తుంది. నా అనుభవాన్నిబట్టి నేను యిది "లక్కగేదె సామెతగా వ్రాసే వ్రాత. ప్రత్యక్షంగా జరగడమే కాకుండా వాది ప్రతివాదులిరుపక్షాలుకూడా సుమారు ముప్పైయేళ్లు వూరుకొన్న దాని విషయంలోనే సాహసించి, అందులో ఒకదానిలోని ప్రధానాంశాన్ని గూర్చి- "నేను చెళ్లపిళ్లవారియొద్ద ఒక్క యక్షరమైనను చదువుకో లేదనియు” ఇంకా యేమో ఎక్సెట్రాలు అనియు వ్రాసినట్లు వ్రాసేవారు కనపడ్డ నాకు పైవిషయాలలో అట్టి సందేహం కలగడానికి అభ్యంతరం వుంటుందా? అసలు వ్యక్తి "చదువుకోలేదు" అని వ్రాసెనో? మఱేవిధంగా వ్రాసెనో? పరిశీలించేవారు లోకంలో నూటికి యెంతమంది వుంటారో? విజ్ఞులు విచారించాలి. విమర్శించకుండా యీ వ్రాతనేనమ్మి ప్రచారం చేయడంవల్ల కొందఱు ఆలా చెప్పకొనేవారున్నూ, కొందఱు యూలా చెప్పకొనేవారున్నూ వున్నట్టు భవిష్యత్కాలం వారికి తెలియబడుతుంది. దానితో రెండుమతాలు వున్నట్టవుతుంది. దానితో అది నిజమా? ఇది నిజమా? అనే సంకటం యేర్పడుతుంది.

భవతు. యివన్నీ “నీలాపనిందలు" కావు. ప్రసక్తానుప్రసక్తంగా వాట్లకి కాస్త దగ్గిఱచుట్టఱికం కలవికూడా యిందులో వచ్చి చేరినట్లయింది.

బాగా విచారిస్తే పురాణగాథలన్నీ యీలాటి సంకటానికి లోబడినట్టే కనపడుతుంది. వాల్మీకి రామాయణంలో రావణకుంభకర్ణులిద్దఱినీ రాముడే వధించినట్లు కనపడుతుంది. భారతంలో కుంభకర్ణుణ్ణి లక్ష్మణ స్వామి వధించినట్లు వుంది. యీ భేదాలకూ ఆదీ అంతమూ వున్నట్టేలేదు. యేమైనా పూర్వ గాథలో కావడంచేత వీట్ల కీగతిపడితే పట్టిందనుకుందాం, మాగాథలు నిన్నా మొన్నా జరిగినవాయె, మామాచేతివ్రాతలతో నిండివున్నవాయె. ఎందఱో ప్రాజ్ఞులు యెఱిగివున్నవాయె. వీట్లను (యెప్పుడోకాదు ఉభయ పార్టీల జీవితకాలంలోనే) అన్యథాకరించి వ్రాయడానికి సాహసిస్తే యేం చేసేది? ఆలా అన్యథాకరించడంలో యెంతో నైపుణ్యం వుంటే బాగుండేది. అదిన్నీ కనపడదు; యీకర్మం యిప్పటి చరిత్రలను అపవదించేవారికే కాదు. పూర్వగాథలను అపవదించే వారికిన్నీ వున్నట్టు నా బుద్ధికి కనపడదు.

ఆనందరామాయణమంటూ వొకటి బయలుదేఱింది. అదిన్నీ వాల్మీకి కృతమనే కనపడుతుంది. గద్యమునుబట్టి చూస్తే దానిలో వున్నంత అనౌచిత్యమూ పరస్పర విరోధమూ,