పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/385

ఈ పుట ఆమోదించబడ్డది

నేనూ-మా తిరుపతి శాస్త్రుల్లూ

389


అందుచేత ఆయీ పద్యాలల్లో మధ్యమధ్య కొత్తవాక్యాలు చేరడమేకాక అసలు కథా సందర్భాలే మాఱడం తటస్థించేది. యిదేమిటంటే “యిదేం వేదమా? శాస్త్రమా? పోనీ పొ” మ్మనేవాఁడు.

సుమారు ముప్ఫైయేండ్లకాలం కలిసి మెలిసి సంచారంచేసి సభలు చేసినవాళ్లం మేము. నన్నుగూర్చి అతఁడు వ్రాయవలసి వచ్చినా, అతణ్ని గూర్చి నేను వ్రాయవలసివచ్చినా వుభయుల చరిత్ర వచ్చేతీరుతుంది. యెన్ని పేజీలు వ్రాసినా తేలదు. యేదో తరవాయి వున్నట్టే కనబడుతుంది. పాండిత్యాల కేమి? యిద్దరమూ సమానులమే. బుద్ధికిన్నీ డిటో కవిత్వానికీ డిటో, వంటిబలంలో మేమిద్దఱమూ కలఁబడవలసివస్తే అతఁడే నన్నుకొట్టేటట్టే మొదటినుంచీ వుండేవాఁడుగాని, పాపం, ఆలాటి ప్రసక్తి యెప్పడేనా కలిగినా వూరికే దెబ్బ చూపించి ఆఁగిపోయేవాఁడే కాని కొట్టేవాఁడు కాఁడు. దానికి కారణం వ్రాయ నక్కఱలేదు. యిదివఱకు వ్రాసినదానిలో వుంది. "క. నాకన్న బుద్ధిబలమున నే కాదు తనూ బలమున" అని నేను సానుభూతిపద్యాలల్లో వ్రాసిన విషయం కొంత వ్యాఖ్యానాపేక్షతో చేరివుంటుంది. దానివ్యాఖ్యానం అతని జీవితచరిత్రలో చేసివున్నాను. తనూబలాన్నిగూర్చి గీరతంలో వివరించి వున్నాను. “చ. ఒడలిబలమ్మునన్ గెలుతు రొప్పితి నందునుగూడఁ దిర్బతిన్, దడఁ బడఁ గొట్టఁ జాల రొక “దద్దదదిందకట్టు" పట్టినన్ గెడపుదురు" నన్నెప్పుడూ కొట్టలేదుగాని మఱికొందఱిని కొట్టడమేకాదు, చార్జిదాఁకా రావడం కూడా జరిగింది. కొట్టేవాఁడు తొందరమనిషే, వెనకా ముందూ చూచేవాఁడు కాఁడు. చురుకుపాలు.

అతనికంటె అంతో యింతో నేను వయస్సా పెద్దవాణ్ణి, అందుచేత సభాస్థానాల్లో కాని, యితరత్రాకాని పెత్తనమంతా నామీఁదే నడిచేది అందుచేత అతఁడు కొంత అశ్రద్ధగా వుపేక్షాతాత్పర్యంగా వుండేవాఁడు. ద్రవ్యవిషయమైన వివాదాలు మా కెప్పడూ లేవు. విద్యావిషయాలు కొన్ని తెల్పేవున్నాను. అతఁడు శ్రద్ధగా వుండడమల్లా అవధానంలో తనవంతు చరణం చెప్పవచ్చినప్పుడు మాత్రమే. అందులో పూర్ణమైన శ్రద్ధ వహించేవాఁడు. ఆలా వహించకపోతే అసలు ఆ శకటం నడవనే నడవదని వేఱే వ్రాయనక్కఱలేదుగదా! ఆ అవధానపద్యాలు వెంటనే మఱిచిపోవడమంటూ వుండేది కాదుగాని యేమేనా కొన్నాళ్లకేనా “శనగలు తినిచేయి కడుక్కోవడం" జరిగేది. యిద్దఱమూ వుంటే అదో అందంగా వుండేది. ఆయాసభలలో వొక్కొక్కప్పుడు మాలో మేముకూడా “కయికురుబొయికురు” లాడుకోవడమున్నూ పలువురెఱిఁగిందే. నారాయణ దాసుగారు (ఆదిభట్ట)అన్న పేరన్నగారి వశంలో వున్నట్టుగానే అనుకోండి, తిరుపతి శాస్త్రిగారు నావశంలో వుండేవాఁడు. యిది నేను వినయంగా వ్రాసేదానికింద భావించకండి. సర్వవిధాలా సమర్థుఁడైన వక వ్యక్తి యింకొక వ్యక్తివశంలో వుండడం సామాన్యమైన విషయంకాదు.