పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/362

ఈ పుట ఆమోదించబడ్డది

366

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


పిళ్ల అంటే వేదాంతదేశికులు. ఆయన మహాకవియై, మహావిద్వాంసుఁడు కూడా అయివున్నారు. ఆయనకు కవితార్మికసింహుఁడనే బిరుదం. ఆ కాలంలో మహావిద్వాంసులంతా యేకవాక్యతగా శిరసావహించినది వుంది. అట్టివాణ్ణికూడా కేవల కవులలో జమకట్టి తద్ద్వారాగా ఆత్మపాండిత్యోత్కర్షను వెల్లడించుకోవడానికి అప్పయ్యదీక్షితుల వారి ప్రయత్నం. యిందుకోసం కొంత స్వార్ధత్యాగం చేయాలి. కనక తాను మహాకవియై వుండికూడా ఆ కవిత్వ ధనాన్ని త్యజించినట్లయింది.

యీ పండితుల ప్రవృత్తులు ఎంత విమర్శించినా తేలవు. వీరి తారతమ్యనిర్ణయం చేయడానికి యెవరికీ శక్యంకాదు. యెఱిఁగినవిజ్ఞులు క్వాచితంగా లేకపోలేదు గాని, వారిమాటలు సామాన్యులు విని తాత్పర్యాన్ని అవగతంచేసుకోలేరు. వారి వారికి తోఁచినట్టల్లా ప్రచారం చేస్తూ వుంటారు. వారికి యెవరియందుఁగాని ద్వేషం వుండదు. “శివకేశవ"వాదంలాగ యీ వాదం యెడతెగకుండా యెల్లప్పుడూ జరుగుతూనే వుంటుంది. ఆ శివకేశవులు ప్రత్యక్షమై "నాయనలారా! మీ రెందుకు వాదించుకుంటారు? మా యిద్దఱికీ భేదం లేదు. “శివాయ విష్ణు రూపాయ... శివస్య హృదయం విష్ణుః" అంటూ నిష్కపటంగా బోధించినా ఆకాస్తసేపూ వూరుకొని మళ్లా “పూర్వేతి పూర్వా” అని మామూలు వాదాలకు దిగడం తప్పదు. హిరణ్యకశిప్వాదులు మహాసమర్దులై, మంచి రాజకీయధురంధరులై, యెంతో విజ్ఞానులై భగవత్సత్తనుమాత్రం 'తోసిరా' జని సర్వలోకాలూ పాలించడం జరిగింది. యజ్ఞయాగాల్లో హవిర్భాగాలు కూడా తమకే యిమ్మన్నారు. తుదకు ప్రహ్లాదుఁడుద్వారాగా భగవత్పత్త ప్రత్యక్షీకరింపఁబడ్డది. అంతతో ఆ అపోహ తొలఁగవలసిందేనా? తొలఁగిందా? తొలఁగలేదని చెప్పఁగలమా? తొలఁగా తొలగింది. యెన్నాళ్లు? కొన్నాళ్లుమాత్రమే, మళ్లా మామూలాటే! ఇప్పుడు మనలో దాన్ని నమ్మనివారెందఱు? ఆ నమ్మనివారు పండితులు కారా? విజ్ఞానులు కారా? పండితులూ, విజ్ఞానులూ అనిపించుకోవడానికి సంస్కృతభాష చదివితేనేకాని వల్లపడదా? యే భాష చదివినాసరే అనడానికి విజ్ఞులు అంగీకరిస్తారు. అట్టి విజ్ఞులు యిప్పుడు తొక్కేతోవలు చూస్తే భగవంతుఁడున్నాఁడనే నమ్మిక వారికి లేశమేనా ఆత్మలో వున్నట్టు కనఁబడుతుందా? ఓహో! ప్రసక్తానుప్రసక్తంగా చాలదూరం వచ్చాం. వెనక్కి మళ్లదాం.

నేనున్నూ తిరుపతిశాస్త్రులున్నూయే స్థితిలోనైతే యేమి అవిచ్ఛిన్నంగా ముఫ్ఫైయేళ్లు కలిసి మెలిసి వర్తించాము. యెన్నో గాథలు వ్రాస్తే వ్రాయవలసివుంటాయి. ఆ పద్ధతిని వక మహాభారతమంతేనా వ్యాససమితి పెరుఁగుతుంది. అతఁడు మహావిద్వాంసుఁడు, మహాకవి. ఛాందసకుటుంబంలో పుట్టినా ఆ బాపతు ఛాందసం- “భోజనం దేహి రాజేంద్ర