పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/340

ఈ పుట ఆమోదించబడ్డది

344

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


(5) "వేంకటేశకవిదేశికు సన్నుతిసేతు నిచ్చలున్." లోనైన తి. శా. గారి వాక్యాలు ప్రతి విషయానికీ అంతఃకారణం దైవమే అయినా బాహ్యకారణాన్ని కూడా చూపవలసి వుంటుంది కనక ఆలా చూపి వున్నాఁడేకాని అన్యంకాదు. సంతానానికి బాహ్యకారణం స్త్రీపురుష సమాగమమే కాని అంతఃకారణం దైవమే. అతఁడు నమస్కరించి వుత్తరంవ్రాస్తే నేనుకూడా నమస్కరించి వ్రాయడానికి అతఁడు అంగీకరించకపోవడమే కాకుండా "చిరంజీవి" పదంతో వ్రాయవలసిందనడం కూడా పైకారణానికి అంటఁగట్టవలసిందే. వొకవేళ యేలక్షణప్పద్యాలో యెవరివద్దో యెవరో యేకొన్నో అభ్యసిస్తే మాత్రం యిటీవల వారికన్నా మిన్నాశక్తికలవారై వున్నప్పుడు లోకం వారిలో యెవరి కెంత గౌరవం యివ్వాలో అంతా యిచ్చి తీరుతారు. కాని నామకః జరిగిన ఆస్వల్పగురు శుశ్రూషను పురస్కరించుకొని యితరాన్ని అధఃకరించడం తటస్థింపదు. ఆలాటి సందర్భాలల్లోనే.

"గురువు శిష్యుఁడయ్యె శిష్యుఁడు గురువయ్యె"

అనుకోవలసి వస్తుంది. ద్రోణాచార్యులవారివద్ద శుశ్రూష చేయడం విస్తారమే అనుకుందాం. అర్జునుఁడు కృపాచార్లవారివద్దనో? యే కొంచెమోతప్ప శుశ్రూషచేసింది లేదుకదా! ఆకృపాచార్లవారికంటే అర్జునుఁడు తక్కువవాఁడని యెవరేని అనుకోఁగలరా? యీలాటి వుదాహరణాలు నేను చూపనక్కఱలేదు; చదువరులే చూపుకోఁగలరు. మాలో వుండే . తారతమ్యాన్ని నిర్ణయించుకోవడానికి యీవ్రాసిన విషయం అకించిత్కరం. యింకేవేనా వుంటే అవి యథార్థదూరాలు కాకపోతే పనికివస్తాయి. -

ఆ విషయంలో యీ వ్యాసానికి కారకులైన యేకలవ్యశిష్యుఁడు గారు వ్రాసిన వుత్తరంలో కొన్ని మాటలు మిక్కిలి ఆదరించవలసి వుంటాయి.

సంస్కృతసమాసాలువున్న కవిత్వం తి. శా. గారిదనిన్నీ తెలుఁగు జిలుఁగుపదాలు వెం. శా. గారిదనిన్నీ అనుకొనేవారు చాలా అమాయకులు. అలా వ్రాసేవారి వ్రాఁతలు ఆదరించే యెడల తి. శా. గారికి చాలా అన్యాయం జరుగుతుంది. చూడండి!

ఉ. "దగ్గఱ లేరు మామయును దండ్రియు, ద్రోణునితోడిపోరు కాఁ
     దగ్గది, భార్య గర్భవతి, తల్లి సుభద్ర త్వదేకపుత్ర, నీ
     పగ్గె నిరంకుశంబు, పసిపాపవు, పాపులు వారు మేనికిన్
     గగ్గురుపాటు వుట్టెఁ గొడుకా! నిను యుద్ధభరంబు పూన్పఁగన్"