పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/332

ఈ పుట ఆమోదించబడ్డది

336

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


సభారంజకత్వం అప్పటికే నా దగ్గిఱ వుండడమే. వట్టి శాస్త్రంలో యెంత ప్రవేశమున్నా అది ధనార్జనకు సాధకం కాదుగదా! సరే, నలుగురం కలసి వెళ్లి లక్కవరంలో ఒకరోజు పురాణం చెప్పడానికి సభ జరిగించాం. తి. శా, గారు చదవడం, నేను రాగధోరణితో అర్థం చెప్పడం. విరాటపర్వం ఉత్తరగోగ్రహణం పురాణం జరుగుతూ వుంది. గంట గంటన్నఱ జరిగాక, యెవరో వక సభ్యుఁ డన్నాఁడు కదా "అయ్యా! మీరే చదివి కొంతసేపు మీరే అర్థం చెపితే వినాలని కొందఱు కుతూహలపడుతున్నా"రన్నాఁడు. వినీ విననట్టు మేము మామూలుగా చెప్పుకుపోతున్నాం. మళ్లా అలాగే అన్నాఁడాయన. దానిమీఁద తి. శా. పుస్తకం నాచేతికిచ్చేశాఁడు. మఱి కొంతసేపు నేనే చదివి నేనే అర్థం చెప్పడం జరిగింది. సమ్మానమున్నూ జరిగింది. కాని నామనస్సులో తి. శా. కి కష్టంగా వున్నట్టు అనుమానం వుదయించింది. దానికి తథ్యంగా ఆమర్నాడు నేను యాచనకు పనికివచ్చేలాగు చెప్పిన "శ్రీసుధాంశునిఁ బోల్పఁగా సరియౌ" అనే పద్యంలో మూఁడోచరణం, అంటే "భార్గవుండీ డనఁబరఁగు భార్గవునకుఁ గ్రోధాపవాదంబు కూడదేని" అనే చరణంలో వున్న పరశురాముణ్ణి దానవిషయంలో పోల్చడం కవి సమయవిరుద్ధ మంటూ పోట్లాట కారంభించాఁడు. చాలాసేపు పరశురాముఁడు మహాదాత నిన్నీ రాజుల నందఱినీ వధించి భూమి యావత్తూ బ్రాహ్మలకు ధారపోశాఁడనిన్నీ నేనున్నూ వాదించాను. కాని “అయితే అయింది కాక; అంతమాత్రంచేత లాభంలేదు. పూర్వకవు లెవ్వరూ వాడలేదు కనక వొప్పేదిలే"దన్నాఁడు. తుదకి “త్వం శుంఠా త్వం శుంఠా” “ముష్టియుద్ధం పునః పునః" దాఁకా వచ్చింది. కొట్టుకోవడంకూడా జరిగినట్టే జ్ఞాపకం. మఱి యిద్ధఱుకూడా వున్నారు కనక జుట్లు వదిలిపించారనుకుంటాను. యీవాదంలో “నిన్ను మట్టు పెట్టకపోతే నన్నీ పేర పిలవనే వద్ద"న్నాఁడు తి. శా. నాకు అప్పటికి పూర్వరకం గిరజాలు వుండేవి. మీసం వస్తూవస్తూవుంది. సిద్ధంగా వున్న ఆస్తి గిరజాలు కనక “నేను వోడిపోతే గిరజాలు గొఱిగించుకుని అప్పుడు ఆచరణం దిద్దుతానుకాని యాలోగా దిద్దేదిలే"దన్నాను నేను. గురువుగారిదగ్గిఱికి వెడితేనే కాని యీ తగవు తీరదు. ప్రస్తుతం ప్రయాణంలోవున్నాం. ఒకరికీ వకరికీ "పచ్చగడ్డేస్తే భగ్గు" మనే స్థితిలో వుంది. “యీలాటి తప్పుడు కవిత్వం చెప్పే నీతో నేను కలిసివచ్చేది లేదన్నాఁడు తి. శా. "నీవు రానేవ"ద్దన్నాను నేను. అప్పుడు యింకొక విద్యార్థిన్నీ అతఁడున్నూ కలసి జంగారెడ్డిగూడెం వెళ్లారు. నేనున్నూ, మఱోవిద్యార్థిన్నీ కామవరపుకోట వెళ్లాము. తి. శా. వెళ్లినచోట ద్రవ్యార్జనకు మంచిది కాని ఆదాత ఆసమయానికి తాగి వున్నాఁడు. అందుచేత శుద్ధశూన్య మయిపోయింది. కామవరపుకోటలో దుకాణానికి డబ్బూ, రెండు డబ్బులూ ముష్టెత్తి యేస్వల్పమో గణించుకొని నియమితకాలానికి గురుసన్నిధానానికి చేరుకున్నాం. మేం తెచ్చిన ద్రవ్యం కొంచెమే అయినా