పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/313

ఈ పుట ఆమోదించబడ్డది

మా ముత్తాత

317


సోదరులు తక్కిన యిద్దఱికీకూడా ఈయనతోపాటే. అయినప్పటికీ తక్కిన యిద్దఱినీ యేమీ అనక “మహా పండితుడి పేరు పెట్టినందుకేనా వీడు పండితుడు కావద్దా" అని కాబోలు, నరసకవిగారి పేరింటి కొమారుణ్ణి మా పినతండ్రిగారిని మా తాతగారు తఱుచు తిడుతూ వుండేవారట. అయితే మా తండ్రుల విద్యాశూన్యతకు కారణం మాతాతగారే అనికూడా తెలుస్తుంది. అందఱు కొడుకులనీకూడా చిన్నప్పటినుంచీ వ్యవసాయంలోనే పెట్టేరట. ఎవరేనా. "ఏమండీ! వెంకన్నగారూ! మీ అబ్బాయిలకు చదువేల చెప్పించ"రని అంటే. “మావాళ్లకి చదువెందుకు? నామాటలు నేర్చుకుంటే చాలదా” అని జవాబు చెప్పేవారట. నాకు నాలుగేళ్ల వయస్సులో వారు యెనభయ్యో పడిలో కాలంచేశారు. విగ్రహాన్నిమట్టుకు యెఱుగుదునుగాని, ఆయన వాగ్ధోరణి యెట్టిదో తెలిసికోదగ్గ జ్ఞానం నాకప్పటికిలేదు. పైగా యింకొకమాట అనేవారట. చదువుకుంటే వకళ్లని వెళ్లి మనంచూడాలి. వ్యవసాయం చేసుకుంటే మనలనే వచ్చి వకళ్లు చూస్తారనేవారట. అప్పటి మాటెట్లాగైనా, బ్రాహ్మణులకు వ్యవసాయం చేసుకుంటేనే బాగుంటుందనేకాలం యిపుడు వచ్చినట్టు తోస్తుంది. మా తాతగారికి, కొడుకులకు చదువు చెప్పించలేదనే అపకీర్తి వున్నది. నేను మాపిల్ల వాళ్లకు చిన్నప్పటినుంచీ విద్య చెప్పతూ వున్నానాకున్నూ ఆకళంకుతప్పలేదు. యేమంటే నేను చెప్పే విద్య “అకారంతః పుంలింగో" యీ కాలంలో విద్యకాదు కనుక, నేనా కళంకానికి మా తాతగారితోపాటు గుఱికాక తప్పిందికాదు. కానీ యీ మధ్య కొందఱు యింగ్లీషులో కృషిచేసి కృతార్డులయికూడా నిరుద్యోగడిపార్టుమెంటుకు ప్రసిడెంటులైవున్నవారు నన్ను అభినందించడానికి మొదలుపెట్టేరు. ఆ కారణంచేత నేను కొంత సరిపెట్టుకో గల్లుచున్నాను. లేకపోతే యింగిలీషు చదివించలేదనే కారణంచేత నన్ను లోకులు యెంతగా నిందించేవారో చెప్పశక్యం గాదుగదా?

అయితే ప్రతి బ్రాహ్మణుడున్నూ"అకారాంతః పుంలింగో"కి సిద్ధపడితే బాగుంటుందని నా తాత్పర్యంకాదు. సిద్ధపడితే చెప్పేవారు లేరు. పూర్వకాలంలో ధర్మార్ధంగా ఈ విద్యలుచెప్పే గురువులుండేవారు. వారికి తిండిపెట్టేవారున్నూ వుండేవారు. వారందఱూ యిప్పుడు గతించారు. శేషించినవారున్నా యేపట్నమో ఆశ్రయించారు, యెట్లోపొట్ట పోసుకుంటూ వున్నారు. సబ్బు కుంకుడుకాయలనూ, కిర్సనాయిలు ఆముదాన్నీ తొలగించినట్లే, పూర్వపు విద్యలను ఇంగ్లీషువచ్చి “తోసిరాజు" చేసింది. ఇంట్లోవున్న చదువు కనుక నేను నా కొడుకులకి చెప్పడానికి వీలిచ్చింది. ప్రతివారున్నూ ఈలా చేయడానికి వీలుండదుకదా. కాబట్టి లాభమున్నా లేకపోయినా ఇంగ్లీషే చదివితీరాలి. అది ద్రవ్యసాధ్యం. ఆర్థికస్థితి ప్రస్తుత మడుగనక్కరలేదు. ఇక ముందువారి కేవిద్యాకూడా లేకపోతుందేమో. ఔరా! కాలగతి! "కొత్తనీరువచ్చి పాతనీరును కొట్టుకుపోయింది.” “హా సీతేకిం భవిష్యసి!"