పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/308

ఈ పుట ఆమోదించబడ్డది

312

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి

అన్న దేవీభాగవతంలోని పద్యం పాఠకలోక మెఱుగదా? ఈ పద్యంలోవున్న మదనాభిరామనృపకన్య, అనే ఆవిడే యామినీపూర్ణ తిలక అని చదువరు లెఱుగుదురుగాక. బిల్హణీయంలోవున్న కథా, ఇదిన్నీ ఒకటే. ఈ రెండు పుస్తకాలేకాక, ఈ కథ, పూర్ణచంద్రోదయం అనే పేరుతో మఱివకటి వుంది. అదిన్నీ బిల్హణీయంవలె మూడాశ్వాసాలే. అది కూడా మా ముత్తాతగారి గ్రంథసామగ్రిలో నేను చిన్నప్పుడు చూచినదే. ఇప్పుడా గ్రంథాల్లో యేమూడునాల్గో గాని, తక్కినవన్నీ పోయినాయి. ఆ పూర్ణచంద్రోదయం అచ్చైనట్టున్నూలేదు. ఆహాహా? ఈలాటి పుస్తకాలెన్ని అంతరించాయోగదా! చాలావఱకు మా ముత్తాతగారు వ్రాసుకొన్నవన్నీ అచ్చుపడ్డవే అని నేను అశ్రద్ధచేశాను. నాప్రయత్నం తుదకు నెగ్గలేదు. గాని కావ్యాలు చదువుకొనే రోజుల్లో అనాధ్యాయాల్లో గురుకులంనుంచి యింటికివచ్చి మాయింట్లోవున్న తాటాకుల పుస్తకాలన్నీ కాగితాలమీద వ్రాయడానికి మొదలుపెట్టేను. కొన్ని వ్రాశాను. అంతట్లో దీనిలో మనకు కృతార్థత కలగడం దుర్లభమని తోచి విరమించాను. ఆ మాత్రం వ్రాయడంవల్లనే నాకు అంతో యింతో బాల్యంలోనే తెలుగు సాహిత్యం కుదిరింది. అచ్చుపడ్డ పుస్తకాల్లో యెన్నాళ్లు చదివినా సరిగా పాండిత్యం కుదరదనిన్నీ చదువుకొనే పాఠం వ్రాసికొని గురువుదగ్గఱ చదువుకుంటే చాలా త్వరగా పాండిత్యం కుదురుతుందనిన్నీ నాకు నమ్మకం. పూర్వుల పాండిత్యాలన్నీ ఆలాంటివే. ఇప్పుడో- “పుస్తకేషుచ యా విద్యా పరహస్తేషు యద్ధనమ్” అన్న మోస్తరు పాండిత్యాలే నూటికి తొంబది తొమ్మిది. ఇక "విద్వాను" లోనైన డిగ్రీలు పొందిన వారిని గూర్చి వ్రాయడమెందుకు?

ప్రకృతానికి వద్దాం. బిల్హణీయపు గాథను కావ్యంగా వ్రాసినవారిలో తుట్టతుదివారు మా ముత్తాతగారే. వీరేశలింగంగారు వీరి కవిత్వానికే యెక్కువ విలువ యిచ్చారు. ఈయన చాలవఱకు యితరుల ననుకరించే స్వభావం కలవారు. ఆ పద్యాలని వదిలిపెట్టి స్వతంత్రంగా వ్రాసినవి చాలా బాగుంటాయి. ధార మిక్కిలీ ధారాళంగా వుంటుంది. వసుచరిత్రని వరవడిగా బెట్టుకోవడంచేత కాబోలు, చేదస్తానికి మితిలేదు. ఈయనేకాదు ఈయనకు కొంచెం పూర్వులుగా వుండే కూచిమంచి తిమ్మకవిగారు లోనైనవారంతా వసుచరిత్రను వరవడిగా పెట్టుకున్నవారే. యమకానికి మాత్రం మా ముత్తాతగారు అందఱినీ అతిక్రమిస్తారు. అందులో అనేక రకాలు; వుదాహరించడానికి మొదలుపెడితే తెమలదు. అయినా మచ్చుకి వకపద్యం వుదాహరించడం మంచిదికదా?

చ. మగువపదంబు కోకనదమానదమా? నదమా? ప్రణాభి, న
    మ్మగనగురూపు భాగ్యకరమాకరమా? కరమా? మృదూరు వెం