పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/294

ఈ పుట ఆమోదించబడ్డది

298

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


యిప్పుడేమేనా మాఱిందేమో కాని ఆనందగజపతి మహారాజులుం గారి ప్రభుత్వకాలంలో లేశమూ మాఱలేదని యెఱుఁగుదును. సంస్థానగౌరవంగాని, పండిత గౌరవంగాని మన ఆంధ్రదేశంలో ఆనందగజపతితో అంతరించిందంటే అంగీకరించనివారుంటారని నేను అనుకోను. ఆ కాలంలో వుండే పండితుల మర్యాదలు యిప్పటివారికి మఱికొందఱికి అంతగారుచించవని యెఱిఁగిన్నీవొకటి యిక్కడ వుటంకిస్తాను. మహామహోపాధ్యాయ (పూర్వం యీ బిరుదు యీలాటి వుద్దండులకు వుండేది) శ్రీ పరవస్తు రంగాచార్యుల వారు విజయనగరానికి సన్నిహితంగా వుండే విశాఖపట్టణ నివాసులైవుండి కూడా ఆ సంస్థానానికి వెళ్లనేలేదు. దానిక్కారణం వారి మర్యాదలకు సంస్థానంవారు సమ్మతించక పోవడమే. ఆచార్లవారికి వారి మర్యాదలకు సంస్థానంవారు సమ్మతించకపోవడమే. ఆచార్లవారికి వుండే మర్యాద లేలాటివంటే! కోట ఆవరణదాఁకా సవారీమీఁద వెళ్లడమున్నూ రాజసభలోకి పాదుకలతో నడిచి వెళ్లి ఆస్థానంలో స్వంత చిత్రాసనం మీఁద కూర్చోవడమున్నూ. బాగా ఆలోచిస్తే పాండిత్యానికి తగ్గ వేషభాషలంటే వైష్ణవులవే. యిందులో చివరదానికి మహారాజులుంగారు సమ్మతించఁ జాల మన్నారఁట. యెందుచేతనంటే? మీవంటి పరమపూజ్యలను మేము మీ ఆచారప్రకారం పూజించడానికి అభ్యంతరం లేదు గాని అది మా సంస్థానపండితులకు అవమానకరంగా వుంటుంది కనక అంగీకరించమన్నారఁట. ఆ పద్ధతిని మీ సంస్థానానికి మేము రాజాల మన్నారఁట ఆచార్యులవారు. (ఆ యీ సంగతులు నేఁటివారు పిచ్చిగా భావిస్తారు) అంటే. అంతతో కథ ముగిసింది. "సా కిం న రమ్యా నచ కిం నరంతా బలీయసీ కేవల మీశ్వరాజ్ఞా" వుర్లాం పేరుకు చిన్నజమీనే అయినా పండితసత్కారం పరీక్షించి చేసేది కావడంచేత మన దేశంలో దాని పేరు ప్రతిష్ఠలు చాలా వ్యాపించాయి. యే యూనివర్సిటీకికూడా దానికున్నంత అధికారంలేదు. ఇచ్చేదేమో సా 1 కి 12-0-0 రూపాయిలు మాత్రమే కాని చేసే పరీక్ష మాత్రం నూటికి నలభై మార్కుల బాపతుకాదు. నూటికి నూరూ రావడం విధి. దీనిలో యేమాత్రం తగ్గినా దానిలోటు యిచ్చే రు 12-0-0 లలో అణో అర్ధణో కానో తుదకి పైసో తగ్గించి మఱుసటి సంవత్సరం ఆలోటు భర్తీ అయిన తరవాతే పూర్తి వార్షికం యిచ్చేవారు. ఆ సంస్థానంలో పరీక్షాధికారులుగా వుండే పండితులకు మాత్రం నూటపదహార్లు వార్షికము వుండేది. రంగాచార్లవారు శాస్త్రాలకు పరీక్షాధికార్లు. వీరిని వంచించాలని కొందఱు పండితులకు కుతూహలం కలిగి మంత్రవాది లక్ష్మీనారాయణ శాస్తుర్లుగారిని ప్రోత్సహించినట్లున్నూ, వారు వారి కుతూహలానికి అనుగుణంగా రెడ్డిగం వేసుకొని కూర్చున్నట్లున్నూ జమీందారు బసవరాజుగారు అది చూచి - "అయ్యా!