పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/285

ఈ పుట ఆమోదించబడ్డది

వికటవిమర్శనం

289


అనుభవించడమనే దోషం తగిలి రఘుమహారాజులకు, 'అమ్మ మగఁడు. నాయనమ్మ మగఁడు' వగయిరా దోషాలను సంఘటిస్తుందనుకుంటాను. కుల క్రమాగతమైన రాజ్యపరిపాలనాన్ని ఆమోదించే రాజుల కందఱికీ యీ దోషం తగిలే తీరుతుంది. గనక యీ ఆక్షేపణ చేయఁగూడదంటారేమో? ఆక్షేపకులెవ్వరూకూడా మఱికొందఱికికూడా తగులుతుందన్నంతమాత్రంలో ఆక్షేపించడాన్నుంచి విరమించరు సరికదా! మీకు మఱీ మంచిది అలా తగలడమనికూడా జవాబు చెపుతారు. కాఁబట్టి విజ్ఞులు మార్గాంతరం విచారించాలి.

శ్లో. "కుంభయోనే ర్మహౌజసః" (21 శ్లో)

యిందులో అగస్త్యుఁడనే అర్థంయిచ్చే కుంభయోనిపదం కుంభమువంటి. అని ఉపమానపూర్వ పదకబహువ్రీహిగా చెప్పుకోవడంవల్ల అశ్లీలార్థం యిచ్చి తీరుతుంది. కుఱ్ఱ వాళ్లకు పాఠం చెప్పడంలో చాలాచిక్కు కలిగిస్తుంది కాఁబట్టి 'కుంభసూతేః’ అని సవరించాలంటాను.

శ్లో. “విశాంపతి ర్విష్టరభాజమారాత్ (3 వశ్లో - 5 సర్గ)

ప్రజా పాలకుఁడు అనే తాత్పర్యంతో యీ శ్లోకంలో వాడిన 'విశాంపతిః' అనే పదం దురర్థాన్ని కూడా యిచ్చేదిగా వుండడంచేత చింత్యం కాక తప్పదు. ప్రయోగాలు కావాలంటే -

శ్లో. “విడ్జాలసమవిడ్జాలం భాతి పెద్దాపురం"

ఇత్యాదులు పెక్కులు. యీలాంటి విమర్శన చేయకూడ దనియ్యేవే నా అభిప్రాయం గాని నిజంగా కాళిదాసుకవిత్వం దోషభూషితమని లేశమున్నూకాదు. అయితే యీవ్రాఁత - పాడువ్రాఁత - యెందుకు వ్రాశా? వంటారేమో? కాళిదాసాదులలో కూడా సహృదయత్వం లేనివారికి యిట్టి అపార్థాలు కనపడేటప్పుడు అస్మదాదుల మాట లెక్కేమిటి? అని చూపడానికే కాని వేఱుకాదు. కనక సహృదయులు నన్ను క్షమించాలి!!

★ ★ ★