పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/282

ఈ పుట ఆమోదించబడ్డది

286

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి

శ్లో. "వన్యవృత్తి రిమాం శశ్వదాత్మానుగమనే నగాం" (88 శ్లో)

యీ శ్లోకంలో గోవును అనుగమించడం వుపదేశించారు వసిష్ఠుల వారు. యీ అనుగమించడంకూడా కొంచెం అళ్లీలార్థానికి తోవతీస్తుందని నా ఆశయం. దానికి “వన్యవృత్తి" అనే విశేషణం కొంత సహాయం కూడా చేస్తుంది. నందినీధేనువు వన్యములైన గడ్డి వగయిరాలవల్ల జీవనం చేసేదే కనక నీవున్నూ వన్యములైన కందమూలాదులతో జీవనంచేస్తూ దాన్ని అనుగమించ వలసిందని వుపదేశించినట్లు తేలుతుంది. సహృదయులు బాగా ఆలోచింతురుగాక! యీ అర్ధంవల్ల తోఁచే అపార్ధాన్ని దీని తర్వాత శ్లోకం “వ్రస్థితాయాం" అనేది పూర్తిగా బలపఱుస్తుందని చెప్పనక్కఱలేదు. విస్తరభీతిచే దానికి దోషోపోద్బలకంగా వ్యాఖ్యానించి చూపలేదు.

శ్లో. “... విససర్జోర్జిత శ్రియం.” (63 శ్లో)

దీనిలో “ఊర్జిత శ్రియం" అనే విశేషణం దిలీప మహారాజుకు కాళిదాసు వుపయోగించాఁడు. బహువ్రీహిసమాసం చెప్పక కర్మధారయ సమాసం చెప్పుకొంటే అపార్థం వస్తుంది. బహువ్రీహి అన్యపదార్ధప్రధానం, కర్మధారయ ఉత్తరపదార్థ ప్రధానం. కాఁబట్టి బహువ్రీహ్యపేక్షయా కర్మధారయ చెప్పుకోవడంలో గురుత్వం తక్కువకనక శాస్త్రజ్ఞులు సమ్మతిస్తారు. యీ అర్థంలో అపార్థం ఏమిటంటే? వెనక "స్రష్టు" అనే పదం వుంది కనక దానికి "బ్రహ్మయొక్క" అనే అర్థం మామూలుగానే చెప్పుకొని, “బ్రహ్మయొక్క శోభను వదిలిపెట్టెను" అని అర్థం చెప్పుకొంటే “వసిష్ఠుఁడు బ్రహ్మ తేజస్సును గోలుపోయినాcడు” అని పిండితార్థం తేలుతుంది. యెందుకు వసిష్ఠుఁడు బ్రహ్మతేజస్సును గోల్పోవలసి వచ్చిందంటే? రాజర్షి అనిపించుకుంటూవున్న దిలీప మహారాజుకు ప్రాయశ్చిత్తార్హమైన పశుగమనాన్ని వుపదేశించడంవల్ల వసిష్ఠునకు యిట్టి దుర్దశ ఘటించిందని సుగమంగా తేలుతుంది. వసిష్ఠుఁడు యీ దోషాన్ని ఎఱుఁగఁడేమో? అంటే ధర్మశాస్త్రకర్త అయివుండి శ్లో “పశువేశ్యాది గమనే ప్రాయశ్చిత్తం విధీయతే" అన్న అక్షరాలు తెలియకుండా ఉంటాడా? అయితే “స్రష్టుః" అనే పదం 'సూనుః’ అనే దానికి సంబంధిస్తుంది గాని శ్రియం అన్నదానికి సంబంధించ దంటారేమో? అదినాకున్నూ తెలుసును. అక్కడ అన్వయించాక కూడా ఆవృత్తిచేత యిక్కడిక్కూడా తీసుకు వచ్చి యీ అపార్ధాన్ని కల్పిస్తాననియ్యేవే నేను మనవి చేసేది. పోనివ్వండి. దీన్ని యేలాగో నా కనుకూలించకుండా తప్పిస్తారే అనుకోండి. నేనిదివఱకెన్నో చూపియున్నాను గదా! వాట్లని యెలాతప్పిస్తారో? సెలవు దయచేయ వలసిందంటాను. స్థాలీపులాకన్యాయంగా విమర్శిస్తే ప్రథమ స్సర్గలో యిన్ని వ్యత్యాసాలు కనపడుతూ వున్నాయి. యిదేరీతిగా ద్వితీయ స్సర్గలోకూడా విమర్శించి చూస్తాను.