పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/275

ఈ పుట ఆమోదించబడ్డది

పౌరాణికులు నీచులా?

279


చుట్టరికం. ఒక్కొక్క కవివాణి వొక్కొక్కరికి నచ్చుతుంది. ఒక్కొక్కరికి నచ్చదు. భిన్న రుచిర్హి లోకః యెవ్వరికీ నచ్చనిదంటూ వుంటుందని నేననుకోను.

"లోకులరసనలె యాకులుగా నుండునట్టియవివో కవితల్" (కవికర్ణ)

ఈ వైభవం పట్టడం కష్టం. కేన్వాసింగు వల్లకూడా యీ వైభవం పట్టదు. దీనికికూడా సమర్ధనం భవభూతి చూపించాఁడు.

“ఉత్పత్స్యతే మమతుకోపి సమానధర్మా కాలోహ్యయం నిరవధిర్విపు లాచ పృథ్వీ" అన్నాఁడు. ఈవిషయం సహృదయైకగమ్యంగాని వైతండికులతో వాదించి తేల్చదగ్గదికాదు. తనమనస్సులో నొకటిపెట్టుకొని పైకినొకటి మాట్లాడువారు సహృదయు లెన్నటికిన్నీ కారు. విషయం విషయాంతరంలోకి దూకుతూవుంది. ప్రస్తుతం పౌరాణికులను గూర్చి కదా వుపక్రమించాను. వారు బీదవారే యగుదురుగాక. వారు నా దేవీభాగవతాన్ని పురాణం చెప్పి వ్యాప్తికి తేవడం నారచనకు గౌరవాపాదకమే. దానివల్ల నారచనకు నైచ్యంరాదని నానమ్మిక. ప్రత్యుత గౌరవమే. నారచనలో వ్యాకరణాది దోషాలుంటే అట్టిదోషం తగులుతుంది. దానికి పౌరాణికులు కారణంకాదు. నేను ఛందోమాత్ర పరిజ్ఞానంతో రచనకు దిగితే... "వ్యాకరణాదివిత్" అని వుండడంచేత అట్టిదోషం తగులుతుంది. కేవల లక్ష్యజ్ఞానం మీఁదగాని లక్షణ జ్ఞానం మీఁదనే గాని కవి ఆధార పడకూడదు. రెంటినీ అనుసరించాలి. అందులో లక్ష్యమే ప్రధాన స్థానానికి వస్తుంది. వ్రాస్తేచాలా వ్రాయాలి. కొంచెం దిక్ప్రదర్శనం చేస్తాను. శ్రీమాడభూషి వేంకటాచార్యులువారు (అభినవ పండితరాయలు) అక్షిభ్రువ అని ప్రయోగించారు. వారి సమకాలికులే బాగా కవిత్వం చెప్పేవారే 'చక్షుర్ర్భువ' అని ప్రయోగించారు. చక్షుః భూః, యీ రెండున్నూ కల్పితే అకారాంత యేలా అయిందని ఎవరో అడిగితే, యీయనకు వ్యాకరణం రాదు కనుక ఆచార్యులవారి 'అక్షిభ్రువ' అనే ప్రయోగాన్ని చూపించారు. (వైయాకరణాః పిశాచాః ప్రయోగమంత్రేణ నివారణీయాః) అయితే ఆరూపం పాణినీయ సూత్రం (అచతుర, చూ) లో నిపతించ బడివుంది గాని రెండోరూపం నిపతించబడి లేదు. కనక అక్షికిచక్షుః అని మాఱిస్తే ప్రాణం మీఁదకి వస్తుంది. ఆయీరహస్యాలు చిరకాల గురుశుశ్రూషా సాధ్యాలుగాన యితరధా యెంతటి బుద్ధిశాలులకున్ను అంకేవికావు. ఆయీచూపిన అక్షిభ్రువ - చక్షుర్భువ అనే రూపాలవల్ల కేవల లక్ష్యాధారంగా రచన సాగిస్తే నవ్వులపాలు కావలసివస్తుందని వ్యాకరించినట్లయింది. యింకోటి కూడా చూపి దీన్ని ముగిస్తాను. యీగోల యెందఱో మహాకవులకే చాదస్తంగా (తెలియక సుమండీ) కనపడుతుంది. పత్రికాపాఠకుల కీగోల రుచింపదని యెఱిఁగిన్నీ ప్రసక్తి కలగడంచేత జిజ్ఞాసువుల కుపకరిస్తుందని కొంచెం వ్రాస్తున్నాను.